ఇది ఆమోదయోగ్యం కాదు
యుపిలో చట్టబద్ధపాలన స్తంభించింది
సుప్రీం కోర్టు ఆక్షేపణ
న్యూఢిల్లీ : ‘ఉత్తర ప్రదేశ్‌లో చట్టబద్ధ పాలన పూర్తిగా స్తంభించింది’ అని సుప్రీం కోర్టు సోమవారం విమర్శించింది. సివిల్ కేసుల్లో రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు తమ దృష్టికి వచ్చిన తరువాత కోర్టు ఆ వ్యాఖ్య చేసింది. ఒక సివిల్ వివాదంలో క్రిమినల్ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయవలసిందిగా యుపి పోలీస్ డైరెక్టర్‌జనరల్ (డిజిపి), గౌతమ్ బుధ్ నగర్ జిల్లా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ‘ఉత్తర ప్రదేశ్‌లో చట్ట పరిపాలన పూర్తిగా స్తంభించింది. సివిల్ వ్యవహారాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం ఆమోదయోగ్యం కాదు’ అని సిజెఐ అన్నారు.
సివిల్ వివాదాలు పరిష్కారం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని ఒక న్యాయవాది అన్నప్పుడు బెంచ్ ఆగ్రహించింది. ‘యుపిలో జరుగుతోంది తప్పు. ప్రతి రోజు సివిల్ దావాలను క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారు. అది అసంబద్ధం. కేవలం డబ్బు ఇవ్వకపోవడాన్ని ఒక నేరంగా మార్చజాలరు’ అని సిజెఐ అన్నారు. ‘ఐఒ (దర్యాప్తు అధికారి)ని సాక్షి బాక్స్‌లోకి రావలసిందని ఆదేశించగలం. ఐఒను సాక్షి బాక్స్‌లో నిల్చుని క్రిమినల్ కేసును వివరించమనండి& మీరు చార్జిషీట్లు దాఖలు చేసే విధం ఇది కాదు’ అని సిజెఐ పేర్కొన్నారు. ‘ఐఒను గుణపాఠం నేర్చుకోనివ్వండి’ అని ఆయన అన్నారు. ‘సివిల్ కేసులు ఎక్కువ వ్యవధి తీసుకుంటాయనే కారణంగా మీరు ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి క్రిమినల్ చట్టాన్ని అమలులోకి తెస్తారా’ అని కూడా బెంచ్ అడిగింది.
దిగువ కోర్టులో సాక్షి బాక్స్‌లో నిల్చొని, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదును సమర్థించాలని నోయిడా సెక్టార్ 39కు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఐఒను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తమపై దాఖలుచేసిన క్రిమినల్ కేసు రద్దుకు నిరాకరించిన అలహాబాద్ హైకోర్టుపై న్యాయవాది చాంద్ ఖురేషి ద్వారా దాఖలైన నిందితులు దేబు సింగ్, దీపక్ సింగ్ పిటిషన్‌ను బెంచ్ విచారిస్తోంది. నోయిడాలోని ఒక దిగువ కోర్టులో పిటిషనర్లపై క్రిమినల్ కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. అయితే, వారిపై గల చెక్ బౌన్స్ కేసు కొనసాగుతుందని బెంచ్ స్పష్టం చేసింది. ఐపిసి సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), 506 (నేరపూరిత బెదరింపు), 120బి (క్రిమినల్ కుట్ర) కింద నోయిడాలో ఆ ఇద్దరిపై ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.