వివాహం తదితర వ్యక్తిగత అంశాలపై దేశంలోని అన్ని మతాల వారికి, వివిధ సామాజిక నేపథ్యాల వారందరికీ ఉమ్మడిగా ఒకే పౌర స్మృతి చట్టాన్ని తీసుకు రావాలన్న రాజ్యాంగ ఆదేశాన్ని అమల్లోకి తేవాలని భారతీయ జనతా పార్టీ ఆత్రుత పడుతున్నది. అందుకే ఉమ్మడి పౌర స్మృతిపై నెల రోజుల్లోగా సలహాలు ఇవ్వాలని లా కమిషన్ సంబంధిత వర్గాలను కోరింది. తాము గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించి కమిటీల నియామకం జరిగింది. అవి నివేదికలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో బిజెపి తప్పేమీ లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 44వ అధికరణ ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఆదేశించింది. అయితే ఈ అధికరణ రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలోనిది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఏ మాత్రం తొందరపాటు లేకుండా అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడే దాని కోసం ప్రయత్నం జరగాలి.
అంతేగాని తాము అర్ధరాత్రి నిద్ర లేచాము కాబట్టి అప్పుడే సూర్యోదయం అయి తీరాలని కోరుకోడం సబబు కాదు. రాజ్యాంగ సభ చర్చల్లో ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనను ముస్లిం మైనారిటీ ప్రతినిధులు వ్యతిరేకించారు. అది తమ వివాహ చట్టాల రద్దుకు దారి తీస్తుందని వారు అభ్యంతరం తెలిపారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) ఇటీవల ఒక ప్రకటనలో ఈ ప్రయత్నాలను దుయ్యబట్టింది. పెళ్ళి, మహిళల హక్కులు వంటి విషయాల్లో దేశమంతటికీ ఒకే చట్టం అవసరమే. అటువంటి పౌర స్మృతి ఒకటి ఏర్పడి దానికి అన్ని మతాల వారు కట్టుబడి వుండే రోజులు వస్తే అంతకంటే ఆనందించవలసిన విషయం మరొకటి వుండదు. కాని ప్రస్తుత పరిస్థితులు అందుకు బొత్తిగా అనుకూలంగా లేవనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ముస్లింలలో ఎక్కువ మంది భార్యలను కలిగి వుంటారనే దృష్టితో వారికి వారి వివాహ చట్టం ఇస్తున్న ఆ వెసులుబాటును రద్దు చేయించాలని, అలాంటి చట్టం తీసుకొస్తామనే ప్రచారం ద్వారా మెజారిటీ హిందువులందరినీ తమ వెనుక సంఘటిత పరచుకోవాలని బిజెపి ఆశిస్తున్నది. ఇది దాచేస్తే దాగే విషయం కాదు. తాము చేయబోతున్నది ప్రగతిశీల చర్య అనిపించడం ద్వారా హిందూ మెజారిటీని ఆకట్టుకోవాలని అది చూస్తున్నది. అటువంటి పరిణామం ఎన్నికల్లో మొత్తం హిందూ ఓట్లన్నీ తమకే పడేలా చేస్తుందని కమలనాథులు ఆశ పడుతున్నారు. కేవలం ముస్లింలే స్త్రీలను అణచివేస్తున్నారని, ఆధునిక ప్రజాస్వామిక పద్ధతులను కాలరాస్తున్నారని ఎవరైనా అంటే అది అబద్ధమని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. హిందువులలోనూ బహు భార్యత్వం వున్న సంగతిని మరచిపోరాదు. ఉమ్మడి పౌర స్మృతి బాల్య వివాహాలను బొత్తిగా అంగీకరించదు. ఆడ పిల్లకు 18 ఏళ్ళు, పురుషుడికి 21 సంవత్సరాలు నిండే వరకు వివాహం చేయరాదని చట్టం చెబుతున్నది. వాస్తవాన్ని గమనిస్తే దేశంలో బాల దంపతులు ముస్లింలలో కంటే హిందువులలోనే ఎక్కువగా వున్నారు. 10 ఏళ్ళ వయసు రాక ముందే పెళ్ళిళ్ళు జరిగిపోయిన వారు దేశంలో కోటి 20 లక్షల మంది వుంటే వారిలో 84% మంది హిందువులు కాగా, ముస్లింలు 11% మందే. ఇటువంటి దుష్ట ధోరణులకు విరుగుడు విద్యే. సరైన శాస్త్రీయమైన చదువు పూర్తిగా అందరికీ చవకగా అందుబాటులో వుంటే పిల్లలకు బాల్యంలోనే పెళ్ళిళ్ళు చేయాలన్న మూఢత్వం నుంచి తలిదండ్రులు బయట పడతారు.
ప్రభుత్వం విదను, వైద్యాన్ని ప్రైవేటుపరం చేసి సగటు మనిషికి వాటిని దూరం చేయడంలోనే ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలం కాని పరిస్థితులు వున్నాయి. దానిని తొలగించకుండా రాజకీయ అవసరాల కోసం ఉమ్మడి పౌర స్మృతి వైపు తొందరపడి అడుగులేయడం జాతికి ఎంత మాత్రం మంచి చేయదు. బిజెపి పెద్దలు తమ అభిప్రాయాలకు ఆమోద ముద్ర వేయించుకోడానికి తమ పార్టీలోని ముస్లిం నేతల చేత ప్రకటనలిప్పిస్తుంటారు. అన్ని మతాల వారికి వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు రావడం రాజ్యాంగం నిర్దేశించిన అనివార్య లక్షమని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గత ఫిబ్రవరిలో తన అమూల్య అభిప్రాయాన్ని ప్రకటించారు. బిజెపి ఒక పద్ధతి ప్రకారం ‘ముస్లింలను దారికి తెస్తున్నామహో’ అని చాటుకోడానికి ఇటువంటి ప్రయోగాలు చేస్తుంది. చట్టం చేసినంత మాత్రాన చాలదు, సమాజంలో దానికున్న ప్రతికూల పరిస్థితిని తొలగిస్తేగాని ప్రయోజనముండదు. అందుకు ముందుగా జరగాల్సింది అన్ని వర్గాల ప్రజల్లో గల దుర్భర దారిద్య్రాన్ని తొలగించడం. ఏ ప్రభుత్వమైనా ఈ విధిని నిర్వర్తించకుండా ఎన్ని గొప్ప ఆశయాలు వల్లించినా ఫలితం వుండదు.