రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు నిజంగా పరిష్కారం కావాలంటే నక్సలైట్లే కావాలని కోరుకుని దార్శనికతను ప్రదర్శించారు. ఆ ఒరవడిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు చాలా వాగ్దానాలుచేశారు. ప్రత్యేకంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చారు. తను సొంతంగా నా ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని, పౌరహక్కులను నిలబెడతానని చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఇది నమ్మిన ప్రజలు కెసిఆర్‌ని దింపి ఈయనను అధికార పీఠం మీద కూర్చోబెట్టారు. కెసిఆర్ ఎన్ని మంచి పనులు చేసినా పౌరప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో, పౌర సమాజంతో సంభాషించడంలో, ప్రజాసంఘాల నాయకులతో నిత్యసంబంధాలు నెరపడంలో ఘోరంగా విఫలమయ్యారు.
ప్రజా సంఘాలను నిషేధించే వరకు ఆయన ప్రభుత్వ చర్యలున్నాయి. కనుక సులభంగా ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మారు. ఆంధ్ర వలస పాలనలో తీవ్ర నిర్బంధం ప్రయోగింపబడినందువలన కెసిఆర్ అప్పట్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు నక్సలైట్ తరహా పాలన అందిస్తానని మాట ఇచ్చారు. ఇది నమ్మిన ప్రజలు వాళ్లను పంపించి ఈయనను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆచరణలో పదేళ్ల కాలంలో కెసిఆర్ కూడా ఆంధ్ర పాలకుల పరిపాలనకు భిన్నంగా లేకపోవడంతో తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించడంతో ఏర్పడిన అసంతృప్తి అగాధ సందర్భాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం నక్సలైట్లను కోరుకుంటున్నారని ప్రకటించారు. దీంతో ఆయన అంటే నమ్మకం ఏర్పడింది. రాజ్యాధికారం ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అధికారంలోనికి వచ్చిన తొలి రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ప్రయాణం చేస్తున్న మార్గంలో ట్రాఫిక్‌ను నివారించి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సున్నితత్వాన్ని ప్రదర్శించారు.
ప్రజలు మనసు నిండా సంతోషించారు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూ మరోవైపు ప్రజాభవన్ చుట్టూ ఉన్న ఇనుపకంచెలను తెగ్గోశారు. ఆ భవనానికి సామాజిక విప్లవకారుల నామకరణం చేశారు. ప్రజాపాలన దిశగా అడుగులు పడుతున్నాయని ప్రజలు మరింత సంతోషించారు కానీ ఈ ఏడాది. కాలంలో విషయమంతా మొదటికి వచ్చింది. పోలీసులే బలవంతులని తేలిపోయారు. ఏడాది విజయోత్సవాల్లో ప్రజలు పాత్ర ఎక్కడా కనబడడం లేదు. అయితే రాజ్యస్వభావం ఎప్పుడూ కూడా హింసాత్మకంగానే ఉంటుందనేది సత్యం. రాజ్యం వద్ద పోలీస్ వ్యవస్థ ఉన్నంత వరకు పోలీసుల చేతిలోకి పాలకులే జారిపోతున్నంత వరకు రాజ్య స్వభావంలో మార్పు ఉండదనేది కూడా సత్యం. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే డిసెంబర్ 10న నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలీస్ స్టేషన్లో కస్టడి మరణం బోణి జరిగింది.అన్నదమ్ముల మధ్య భూవివాదం కేసులో 2023 డిసెంబర్ 10న పాలెం తండాకు చెందిన లంబాడ జాతి నేనావత్ సూర్య నాయక్‌ను చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
ఆయన వెంబడి మరో నలుగురు కూడా వెళ్లారు. ఆ నలుగురు ఇతర పోలీస్ సిబ్బంది చూస్తుండగానే ఎస్‌ఐ మృగంలాగా సూర్యనాయక్ మీద పడి మెడమీద పిడిగుద్దులు కురిపించాడు. నరాలు చిట్లిపోయి సూర్యానాయక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దేవరకొండ ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స జరుగుతుండగానే ప్రాణాలు వదిలాడు. సబ్‌ఇన్స్‌పెక్టర్ కరాటేలో నిపుణుడు. ఆయన కరాటే నైపుణ్యం అమాయకుని పైన ప్రదర్శించి ప్రాణాలు బలిగొన్నాడు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని కోరుకున్నాడు. కోరిక తీరకుండానే చనిపోయాడు. పోలీసులు సివిల్ కేసుల్లో తలదూర్చి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. 2024 జనవరిలో గద్వాలలో చైతన్య మహిళా సంఘం సాంస్కృతిక కార్యక్రమాల శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి తినుబండారాలు నేలపాలు చేసి ఇతర సామాగ్రినంత చిందరవందర చేసి శిక్షణ శిబిరాన్ని రద్దు చేశారు.
పరేడ్ గ్రౌండ్‌లో నారీశక్తి అద్భుతం అని కొనియాడి ప్రజామహిళా సంఘాలను అణచివేస్తున్నారు. శవాల స్వాధీనానికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారు. పోలీసులు ప్రజా మహిళ కార్యకర్తల ఎడల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావుతో పాటు మరో ఆరుగురి పైన పూసపల్లి కుట్ర కేసు బనాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌తో పాటు మరో నాయకుడు గోపిలను ఖమ్మం జిల్లా కోయిచెలక గ్రామంలో పట్టుకొని అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేశారు. గ్రామాల మీదపడి పార్టీ రహస్య కార్యకర్తల ఆచూకీ తెలపమని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. జూలై నెలలో ములుగు జిల్లాలో రంగాపురం అడవి ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలు జులై 24న జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నాయకుడు విజయేందర్ అలియాస్ నల్లమారి అశోక్ చనిపోయాడు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన మొదటి ఎన్‌కౌంటర్ ఇది. ఏడో గ్యారెంటీకి గండి పడింది. ఇక్కడితో మొదలైంది. కాంగ్రెస్ ఎన్‌కౌంటర్ పర్వం ముఖ్యమంత్రి పోలీసులను మందలించలేదు కనుకనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం లాగానే పోలీసులు పేట్రేగిపోయి శాంతి కోసం రక్తం ధారపోసి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ రక్తపుమడుగు చేస్తున్నారు.
అక్టోబర్ 11న గద్వాల జిల్లా బిజ్వారం గ్రామానికి చెందిన పని అమ్మాయి రాజేశ్వరి (16)ని మల్దకల్ పోలీసులు అరెస్టు చేసి పట్టుకపోతే అవమానాన్ని భరించలేక మరుసటి రోజు ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి చనిపోయింది. రాజేశ్వరి పది ఏళ్ల వయసు నుండి గద్వాలలోని రాజశేఖర్ రెడ్డి ఇంట్లో పని పిల్లగా పనిచేస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్‌లో బంగారం పోయిందని దొంగతనం నేరం మోపి మల్దకల్ పోలీసులను ఉసిగొలిపాడు. గద్వాలలో నివసిస్తున్న రాజశేఖర్ రెడ్డి సంబంధం లేని మల్దకల్ పోలీసులను ఆశ్రయిస్తే కక్కుర్తిపడిన పోలీసులు సరిహద్దులు దాటి రంగంలోకి దిగి అందరి ముందు పట్టుకపోతే అవమానాల పాలైన మైనర్ బాలిక తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసులు మైనర్ బాలబాలికల ఎడల ఎంత సున్నితంగా వ్యవహరించాలో గ్రహించలేకపోతున్నారు.పోలీసులు రెచ్చిపోవడానికి కారణం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణం. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో పౌరులకు న్యాయం అందించడం అంతర్భాగమైన పోలీసు వ్యవస్థ పసిపిల్లల ఎడల మానవీయంగా వ్యవహరించాలి. 13 అక్టోబర్ నాడు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో ముగ్గురు మైనర్ బాలురను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి శిరోముండనం చేసి అవమానాలకు గురిచేసి సమాజంలో తలెత్తుకోకుండా చేసి పంపించారు. లింగాల గ్రామానికి చెందిన వినీత్ (20), అఖిల్ 18, నిఖిల్ 18లో బైక్‌పై పెట్రోల్ బంక్‌కు వెళ్లి 20 రూపాయల పెట్రోల్ వేయాలని కోరారు.
ఆపరేటర్ హేళన చేయడంతో ఘర్షణ పడ్డారు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ముగ్గురునీ పట్టుకపోయి మూడు రోజులు హింసించి వాళ్లు ఎన్నడూ చేయని పనులన్నీ చేయించి చివరికి మంగలిని స్టేషన్‌కు పిలిపించి ముగ్గురికి గుండు గీయించి పంపారు. దళితులు, మహిళలు, కింది కులాల వారంటే పోలీసులకు చిన్న చూపు. అవమానం భరించలేక అఖిల్, నిఖిల్ హైదరాబాద్ వెళ్ళిపోగా వినీత్ లింగాలలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు సమయానికి గమనించడంతో వారం రోజులు మృత్యు తో పోరాటం చేసి బతికి బయటపడ్డాడు.
రాష్ట్రంలో పోలీసుల ఉక్కు పాదాల కింద ఆత్మగౌరవం, పౌర హక్కులు నలిగిపోతున్నాయి. చట్టాలను ఉల్లంఘించిన ప్రైవేటు వ్యక్తులతో పోలిస్తే పోలీసులకు విధించే శిక్ష కఠినంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం ప్రకటించినట్లుగా శిక్షలు లేకపోవడం వలన వారి ఆకృత్యాలు కొనసాగుతున్నాయి. చరిత్రలో ప్రభుత్వాలు మారినా ఎజెండా ప్రజా అనుకూలంగా మారడం లేదు. ప్రపంచ మార్కెట్లో వ్యవస్థ నాశనానికి సానుకూలమయ్యాక ప్రభుత్వాలు నిరసన గొంతులను చిదిమేస్తున్నాయి. కొంతమంది ప్రజా మేధావులను సంలీనం చేసుకుని ప్రతిఘటించేవారని సంహరిస్తున్నది. పౌరసమాజం ప్రజలను మరింత సృజనాత్మకం చేసి అప్రజాస్వామిక ప్రభుత్వాలు అంతం కావడానికి ఎంత చేయాలో అంత చేయాలి.
లక్ష్మణ్ గడ్డం
(అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం)