మనతెలంగాణ/హైదరాబాద్: ఆల్ ఇండియా 20వ ర్యాంక్‌తో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. శ్రీజ, ఆమె కుటుంబం మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రిని కలిసింది. అనేక పరిమితులు ఉన్నప్పటికీ అత్య ంత ప్రతిభా పాటవాలతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన శ్రీజను మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తన తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ, తండ్రి ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్న నేపథ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో శ్రీజ సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా శ్రీజ విద్యాభ్యాసం, ప్రిపరేషన్, ఇంటర్వ్యూ సంబంధిత అంశాల పైన ఆమెతో కెటిఆర్ మాట్లాడారు. తన తల్లి ఉద్యోగానికి వెళుతున్న సందర్భంగా చిన్నప్పటి నుంచి తను చూసిన అనుభవాలే, తనకు స్ఫూర్తిగా నిలిచాయాని, ఆమె స్టాఫ్ నర్స్ గా అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ గా మారి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో తాను చదివినట్లు శ్రీజ ఈ సందర్భంగా తెలిపింది. తల్లి తన ఉద్యోగ బాధ్యతలో చూపిన సేవ స్ఫూర్తితో భవిష్యత్తులో తన విధులు నిర్వహించాలని శ్రీజకు కెటిఆర్ సూచించారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు లభి ంచే అతి గొప్ప అవకాశం అని, దీని ఆధారంగా అనేక మంది జీవితాల్లో మార్పు తేవచ్చని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన శ్రీజను కోరారు. అలాగే 218 ర్యాంక్ తో సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్‌రెడ్డినూ మంత్రి కెటిఆర్ అభినందించారు.
Civil Service 20th ranker Srija meet KTR