ఇటీవల ప్రకటించిన నిబంధనల ప్రకారం, యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్షలకు దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు వయస్సు నిర్ధారణ, రిజర్వేషన్ సంబంధిత పత్రాలు సమర్పించడాన్ని కేంద్రం తప్పనిస చేసింది. ఇంతకు ముందు అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన తరువాత అటువంటి పత్రాలను అప్‌లోడ్ చేస్తుండేవారు. ఐఎఎస్ మాజీ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలో కేంద్రం ఈ నిబంధన తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలో తన ఎంపికకోసం పూజా ఖేడ్కర్ వంచనకు పాల్పడిందని, ఒబిసి, దివ్యాంగుల కోటా ప్రయోజనాలను తప్పుగా పొందిందని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. అయితే, ఆమె ఆ ఆరోపణలు అన్నిటినీ ఖండించింది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సర్వీసుల్లో అధికారుల ఎంపిక నిమిత్తం ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలను యుపిఎస్‌సి ఏటా నిర్వహిస్తుంటుంది.
‘సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేయాలని సంకల్పిస్తున్న అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతో పాటు కమిషన్ కోరే జనన తేదీ, కేటగరీ (ఎస్‌సి/ ఎస్‌టి/ ఒబిసి/ ఇడబ్లుఎస్/ పిడబ్లుబిడి/ మాజీ సైనికులు), విద్యార్హత, సర్వీస్ ప్రాథమ్యం మొదలైనవాటి క్లెయిముల దిశగా సమర్థన పత్రాలను సమర్పించాలి’ అని బుధవారం (22) నాటి సివిల్ సర్వీసెస్ పరీక్ష నిబంధనావళి 2025 స్పష్టం చేసింది. పేరు నమోదు, ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు కావలసిన సమాచారం/ పత్రాలు సమర్పించకపోతే పరీక్షకు అభ్యర్థిత్వం రద్దు అవుతుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు యుపిఎస్‌సి ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తును ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల వరకు దాఖలు చేయవచ్చునని యుపిఎస్‌సి తన ప్రకటనలో సూచించింది.