టెల్ అవీవ్ : ఒకవైపు హమాస్ మిలిటెంట్లతో పోరాడుతోన్న ఇజ్రాయెల్ సైన్యాలకు … లెబనాన్ లోని హిజ్బుల్లా సంస్థ నుంచీ ముప్పు పొంచి ఉంది. హిజ్బుల్లా బలగాలు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పలుమార్లు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యం లోనే లెబనాన్ సరిహద్దు నుంచి తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరం పరిధి లోని నివాసితులను ఖాళీ చేయించేందుకు ఓ ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలిపింది.
మొత్తం 28 ప్రాంతాల నుంచి ప్రజలను తరలించనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్ సరిహద్దు నుంచి తరలించనున్న పౌరులకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్ ఈ ప్లాన్‌ను ఆమోదించినట్టు వెల్లడించింది. స్థానిక అధికార యంత్రాంగం , అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ , నేషనల్ ఎమర్జెస్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తరలింపు ప్రక్రియ సాగుతుందని చెప్పింది. ఇదిలా ఉండగా హమాస్ దాడుల అనంతరం లెబనాన్ నుంచి కూడా హిజ్బుల్లా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు జరిగాయి. ఇటీవల జరిపిన ఓ క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందారు. ఇజ్రాయెల్ కూడా లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటరీ స్థావరాలపై దాడులు చేపడుతోంది.
Also Read: బిఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల