కన్నీళ్లతో కాదు కట్టలు తెంచుకునే ఆవేశంతో
మద్దతు ఇస్తానన్న ప్రధాన న్యాయమూర్తి
ఎన్నాళ్లీ అణచివేతలని సూటి ప్రశ్న
ప్రత్యేక టాయ్‌లెట్లే లేని కోర్టులు
సంఘాలలోనూ అరకొరలు
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోటా కోసం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఎలుగెత్తి చాటారు. ‘మహిళా న్యాయవాదులూ…ఈ సగానికి సగం కోటా కోసం మీరు గట్టిగా నినదించండి, ఆవేదన, ఆక్రోశంతో కాదు ఆగ్రహంతో డిమాండ్‌కు దిగండి, మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు నియమితులైన తొమ్మండుగురు కొత్త న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు చెందిన మహిళా న్యాయవాదులు ఏర్పాటు చేసిన సన్మాన, అభినందన సభకు హాజరై ఆయన ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని జుడిషియరీలోని కీలక స్థానాలలో మహిళకు సరైన ప్రాతినిధ్యం లేనిఅంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాను మహిళా న్యాయవాదులకు పూర్తి మద్దతు ఇస్తానని చెప్పారు. ఈ 50 శాతం కోటా మహిళా న్యాయవాదులకు దక్కాల్సిన న్యాయమైన కోటా, దీనిపై వారు ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. వీరు బిగ్గరగా ఆవేశంతో అరిచి ఈ కోటాను దక్కించుకోవచ్చునని తెలిపారు. ఈ కోటా ఇతరుల దయాదాక్షిణ్యం కాదు, వారి హక్కు అని తేల్చిచెప్పారు.
యుగాలుగా వేల సంవత్సరాలుగా అణచివేతల వ్యథల కథ ఇది అని, ఈ దిశలో మహిళలకు సర్వవిధాలుగా ఈ కోటా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ హక్కును మీరంతట మీరే మీ బలీయ గళాలతో సాధించుకోవచ్చు అన్నారు. మహిళలు మరింత ఎక్కువగా న్యాయవిద్యను అభ్యసించాల్సి ఉంది. అయితే వారికి విద్యాభ్యాసం, తరువాత పదవుల కల్పనలో సరైన స్థానం అవసరం అన్నారు. అన్ని లా స్కూళ్లు , న్యాయసంస్థలలో మహిళలకు నిర్ణీత సముచిత కోటా ఉండాలనేదే తన అభిమతం అని జస్టిస్ రమణ తెలిపారు. కోటా ఇతరత్రా అవకాశాలు ఉంటే మహిళలు ఎక్కువగా లా విద్యను తమ ప్రాధాన్యతరంగంగా ఎంచుకునేందుకు వీలేర్పడుతుందని చెప్పారు. సుప్రీంకోర్టుకు ఇటీవల నియమితులైన తొమ్మండుగురు న్యాయమూర్తులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మహిళా లాయర్లకు మరింత అవకాశం కోసం తాను ఎప్పుడూ ప్రస్తావిస్తానని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి తాను కార్ల్ మార్స్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెపుతానని అంటూ అప్పట్లో మార్క్ ప్రపంచకార్మికులారా ఏకం కండి పొయ్యేది ఏమీ లేదు సంకెళ్లు తప్ప అన్నారని, ఈ సందర్భంగా తాను ప్రపంచ మహిళా ఐక్యం కండి, మీకు జరిగే నష్టం ఏదీ ఉండదు బంధ విముక్తి తప్ప అని అంటున్నానని చెప్పారు.
న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కితే తాను ఎంతగానో సంతోషిస్తానని తెలిపారు. తన సోదరీమణులైన మహిళా లాయర్లకు అన్యాయం జరిగిందని తాను గణాంకాలతో తెలుసుకున్నానని , తాను ఒడిషా నుంచి తిరిగిరాగానే తెలుసుకున్న అంశాలతో దేశవ్యాప్తంగా జుడిషియరీలో మహిళలకు 30 శాతం కన్నా తక్కువ ప్రాతినిధ్యం ఉన్నట్లు వెల్లడైందని, ఇది బాధాకరం అన్నారు. ఇక హైకోర్టులలో మహిళా జడ్జిలు 11.5 శాతం ప్రాతినిధ్యంతో ఉన్నారు. ఇక దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తుల కోటాలో మహిళల సంఖ్య కేవలం నాలుగు అని తెలిపారు. ఇది కూడా దాదాపు 11 లేదా 12 శాతానికి వర్తిస్తుందన్నారు.
దేశంలో కోటి డెబ్బయి లక్షలకు పైగా లాయర్లు ఉన్నారు. వీరిలో 15 శాతం మహిళా లాయర్లు ఉన్నారని, ఇక లాయర్ల సంఘాలలో మహిళల ప్రాతినిధ్యం కేవలం రెండు శాతం అని విశ్లేషించారు. న్యాయస్థానాలలో మహిళా లాయర్లకు సరైన ప్రాధమిక సౌకర్యాలు లేవని, దీనావస్థలో ఉన్న కోర్టు భవనాలలో మహిళా న్యాయవాదులు దైనందిన క్రమంలో చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారని అన్నారు. దేశంలోని 6000 కోర్టులలో 22 శాతం వరకూ మహిళకు ప్రత్యేక టాయ్‌లెట్లు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా న్యాయవాదులు ఈ ఒక్కటే కాదు పలు రకాల చెప్పనలవి కాని బాధలతో గడపాల్సి వస్తోందన్నారు. వీటి పరిష్కారానికి తాను క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాత చర్యలకు దిగుతామని తెలిపారు.