మా వ్యాఖ్యలు వక్రీకరించారు
అత్యాచారం కేసులో సిజెఐ బాబ్డే వివరణ
న్యూఢిల్లీ : ‘మహిళలు అంటే మాకు అత్యంత గౌరవం ఉంది. వారిని కించపరిచే ఉద్దేశం లేదు. అలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే అన్నారు. ఓ అత్యాచార బాధితురాలి కేసు విచారణ సందర్భంగా ‘ఆమెను పెళ్లాడతావా? లేక జైలుకు వెళ్తావా’ అని నిందితుడిని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిజెఐ స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మేం నిందితుడిని ‘నీవు పెళ్లి చేసుకోబోతున్నావా’ అని మాత్రమే ప్రశ్నించాము. అంతేతప్ప ‘బాధితురాలిని పెళ్లి చేసుకో.. లేదంటే జైలుకెళ్తావు’ అని చెప్పలేదు. అలా ఎన్నిటికి చెప్పం. కోర్టు వ్యాఖ్యలని వక్రీకరించారు. ఈ సంస్థ, ముఖ్యంగా ఈ బెంచ్, స్త్రీత్వం పట్ల అత్యధిక గౌరవం కలిగి ఉంది’ అని తెలిపారు.