Monday, November 25, 2024

న్యాయవ్యవస్థ ఎప్పటికీ ప్రజాపక్షమే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని న్యాయవ్యవస్థ ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాపక్షమే అని, ఇది నిరంతరం సాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. దేశ సిజెఐగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆయన చాలా గురువారం ఘాటైన సందేశం వెలువరించారు. పౌరుల కోసం న్యాయవ్యవస్థ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ప్రజలు జుడిషియరీపై తమ నమ్మకాన్ని కనబర్చాలి. న్యాయవ్యవస్థ ఎప్పుడూ ప్రజల ప్రాధమిక హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటుందన్నారు. వారి విశ్వాసం తమ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందన్నారు. చీఫ్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఎప్పుడూ దాపరికం లేకుండా తన అభిప్రాయాలను పంచుకుంటారనే పేరుంది. ఆయన ఏడాది కాల చీఫ్‌జస్టిస్ హయాంలో పలు సమకాలీన అంశాలు, వివాదాస్పద సంక్లిష్ట విషయాలపై తీర్పులు వెలువడ్డాయి. రాబోయే కాలంలో న్యాయ పంపిణీ వ్యవస్థ ప్రభావం మరింత పెరిగేందుకు, సున్నిత అంశాలపై సరైన మార్గదర్శనం చేసేందుకు ఈ తీర్పులు ఉపయోగపడుతాయనే పేరు వచ్చింది. 63 సంవత్సరాల చంద్రచూడ్ న్యాయవాద వృత్తి నేపథ్యపు కుటుంబం నుంచి వచ్చిన వారే.

గత ఏడాది ఆయన ఈ న్యాయస్థాన కీలక బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్‌గా ఆయనకు మరో ఏడాది గడువు ఉంది. చంద్రచూడ్ తండ్రి వైవి చంద్రచూడ్ కూడా దేశానికి చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు. 1978 నుంచి 1985 వరకూ ఈ బాధ్యతలలో ఉన్నారు. కుమారుడు చంద్రచూడ్ ఏడాది పదవీకాలంలో సామాజిక ప్రభావిత విషయాలపై పలు తీర్పులు వెలువరించారు. సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్‌గా డివై చంద్రచూడ్ వెలువరించిన తీర్పులు, ఆయన ఆధ్వర్యంలో సాగిన విచారణల క్రమం గురించి సుప్రీంకోర్టు ఓ వివరాల పత్రం సమర్పించింది. దేశంలో పేరుకుపోయి ఉన్న అత్యధిక సంఖ్యాక కేసుల విచారణ ప్రక్రియల వేగవంతానికి తాము పాటుపడుతామని, ఈ క్రమంలో పౌరుల హక్కుల పరిరక్షణ, మరో వైపు న్యాయమూర్తుల కొరత తీర్చడం తమ లక్షాలని తరచూ ఆయన చెపుతూ ఉంటారు. న్యాయస్థానాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, న్యాయవాదుల పట్ల జడ్జిల మరింత స్నేహభావానికి పాటుపడుతూ వస్తున్నారు. ప్రత్యేకించి న్యాయవాద వృత్తిలోకి మహిళలు మరింత ఎక్కువగా రావల్సి ఉందని కూడా అభ్యర్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News