Friday, November 22, 2024

ఢిల్లీలో వాయు కాలుష్యం..మార్నింగ్‌వాక్ ఆపేసిన సిజెఐ

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పట్ల ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వాయు కాలుష్యానికి భయపడి ఈ మధ్యలో మార్నింగ్‌వాక్‌కు కూడా వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి పొద్దుటి పూట నడకకు వీడ్కోలు చెప్పానని అన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో కొందరు జర్నలిస్టులతో గురువారం ఆయన ముచ్చటించారు. వయస్సు మీద పడింది కదా , డాక్టరు మిత్రుల వద్దకు వెళ్లితే వారిచ్చిన సలహా ఒక్కటే అని, ఉదయం పూట బయటకు వెళ్లొద్దు, ఇంటిపట్టునే ఉండండి లేకపోతే శ్వాసకోశ వ్యాధులు అంటుకుంటాయని చెప్పారని సిజెఐ వెల్లడించారు. ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేయాలనే అన్పిస్తుంది కానీ విషపు గాలి అడ్డుతగులుతోందని తెలిపారు. తాను రోజూ తెల్లవారుజామున 4 లేదా నాలుగుంబావుకు బయటకు వెళ్లుతుంటానని వివరించారు.

ఈ నెల 10వ తేదీన చంద్రచూడ్ పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక జర్నలిస్టులకు శుభవార్త చెప్పారు. కోర్టు విచారణల కవరేజ్‌కు వచ్చే అక్రిడేటెడ్ జర్నలిస్టులు లా డిగ్రీ చేయాలనే నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఇక వారు తమ వాహనాలను సుప్రీంకోర్టు ఆవరణలో పెట్టుకునేందుకు అనుమతిని ఇచ్చినట్లు వెల్లడించారు. దేశంలో కోర్టు తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోనికి అనువదించే ప్రక్రియ చురుగ్గా సాగుతోందని చెప్పారు. ఇందుకు ఎఐ సాయం తీసుకుంటున్నట్లు , ఇక తప్పులు దిద్దే బాధ్యతను రిటైర్డ్ జిల్లా జడ్జిలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రికార్డుల డిజిటలైజెషన్ వల్ల జడ్జిలు తమ ఐప్యాడ్‌లలో చివరికి విమానాలలో వెళ్లుతున్నా తీర్పులను పఠించే వీలేర్పడిందన్నారు. రిటైర్మెంట్ తరువాత ఏమి చేయాలనుకుంటున్నారు? అని అడగ్గా మొదటి కొద్ది రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే ప్లాన్ అని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News