Wednesday, January 22, 2025

సుప్రీం కోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్.. సీజేఐ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటివరకు అనేక సంస్థలు , వ్యక్తులు బ్రాండ్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలిస్తున్న ఈ మోసగాళ్లు, తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే టార్గెట్ చేశారు. “సుప్రీం కోర్టు” పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడిస్తూ, ఆ వెబ్‌సైట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లాయర్లు, వ్యాజ్యదారులను హెచ్చరించారు.

అటు సుప్రీం కోర్టు రిజిస్ట్రి కూడా దీనిపై పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. “ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. రెండు యుఆర్‌ఎల్ లను కూడా జనరేట్ చేశారు. వీటితో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటిని ఎవరూ షేర్ చేయొద్దు. అందులో రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ఎన్నడూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. రహస్య వివరాలు, ఆర్థిక లావాదేవీలు గురించి అడగదు” అని రిజిస్ట్రీ తమ నోటీస్‌లో పేర్కొంది. “ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా www.sci.gov.in డొమైన్‌తో రిజిస్టర్ అయి ఉంది.

ఈ కోర్టు పేరుతో ఏదైనా యాఆర్‌ఎల్ వస్తే దాన్ని క్లిక్ చేసే ముందు ఒరిజినల్ డొమైన్‌తో సరిచూసుకోండి. ఒకవేళ సైబర్ దాడికి గురైతే గనుక… వెంటనే మీ అన్ని ఆన్‌లైన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోండి ” అని రిజిస్ట్రీ సూచించింది. ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి ఇప్పటికే దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లామని, దీని వెనుక బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని పేర్కొంది. అటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా దీని గురించి ప్రజలను హెచ్చరించారు. “ నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. సుప్రీం కోర్టు పేరుతో వస్తున్న ఆ నకిలీ లింక్‌లను క్లిక్ చేయొద్దు. దాన్ని నగదు లావాదేవీలకు ఉపయోగించవద్దు” అని న్యాయవాదులు, వ్యాజ్య దారులకు సీజేఐ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News