అధికారులు, పోలీసు వ్యవస్థపై ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు సిజెలతో స్థాయీ సంఘం ఏర్పాటు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో అధికారులు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోయే పోలీసులను న్యాయవ్యవస్థ ఎన్నటికీ రక్షించదని స్పష్టం చేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవలసిందేనని… కోర్టులను ఆశ్రయించడం కొంత మంది అధికారులకు అలవాటుగా మారిందన్నారు. చత్తీస్‌గఢ్ అదనపు డిజిపి గుర్జిందర్ పాల్ సింగ్ తనపై నమోదైన క్రిమినల్ కేసులనుంచి రక్షణ కల్పిచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్లపై జీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిజెఐ మాట్లాడుతూ, అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవలసి ఉందని అన్నారు. ఇందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్ ఎన్‌వి రమణ చెప్పారు. అయితే ప్రస్తుతానికి స్థాయీ సంఘం ఏర్పాటుపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదన్నారు. కాగా గుర్జిందర్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది.