Thursday, January 23, 2025

జిల్లా కోర్టులతో సత్వర న్యాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్‌మెంట్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సిఎం కెసిఆర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో ఒకసారి రాష్ట్ర హైకోర్టు ప్రారంభోత్సవానికి వచ్చానని, ఇప్పుడు మళ్లీ 33 జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనంలో ఉందని, చాలా అంశాల్లోనూ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రం తలసరి ఆదాయం, జిఎస్‌డిపి వృద్ధిరేటు, వ్యవసాయరంగం, ఇండస్ట్రియల్ గ్రోత్, ఐటి రంగంలో ఉజ్వలంగా దేదీపమాన్యంగా దూసుకుపోతోందన్నారు. జస్టిస్ ఎన్‌వి రమణ ఇదే హైకోర్టులో పని చేసిన ఈ గడ్డబిడ్డని, వారు ఎంతో పెద్ద మనసుతో కేంద్రంతో మాట్లాడి మన హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచారన్నారు. జిల్లా కోర్టులు కావాలని కోరిన వెంటనే సిజె అంగీకరించడంతో జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. హైదరాబాద్ పాత జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాలో కోర్టులు వస్తున్నాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. ములుగు, భూపాలపల్లి రెండు పెద్ద జిల్లాలని పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా సత్ఫాలితాలు వస్తాయని తెలిపారు.ఈ కోర్టులకు కావాల్సిన సిబ్బందిని మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోయర్ జ్యుడిషీయరీలో పటిష్టత కోసం ఇటీవలి కాలంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయశాఖ అధికారులతో సుదీర్ఘమైన భేటీ నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, సెషన్స్ కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారన్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిపాలనలో సంస్కరణలను అమలు చేశామని, ఇందులో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఎన్నో సత్ఫలితాలను సాధించామని, సిటి సివిల్ కోర్టులు, రంగారెడ్డి కోర్టు చాలా ఓవర్ లోడెడ్‌గా ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. వీటిని కూడా విభజించాలని అనుకుంటున్నామని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందన్నారు. దీంతో ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయ, అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ , జస్టిస్ పి. నవీన్ రావు , హై కోర్టు జడ్జీలు, సీనియర్ అడ్వకేట్లు, రాష్ట్ర న్యాయ అధికారులు, హైకోర్టు సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి కోసమో పనిచేయదు ః సిజెఐ ఎన్‌వి రమణ
న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరితో పాటు ఉద్యమానికి నేతృత్వం వహించిన సిఎం కెసిఆర్‌కు ఎన్‌వి రమణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. న్యాయవ్యవస్థ అభివృద్ధిలో ఎంతోకొంత విజయం సాధించామని, న్యాయవ్యవస్థ ప్రజలకు ఎల్లప్పుడు చేరువలో ఉండాలన్నారు. అందుకే కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు జడ్జీల నియామకం చేశామన్నారు. తెలంగాణకు సంబంధించి 4 కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఈ క్రమంలోనే ప్రజలకు న్యాయ వ్యవస్థ చేరువ ఉండాలనే ఉద్దేశంతో కొత్త కోర్టులను ప్రారంభించుకుంటున్నామని సిజెఐ పేర్కొన్నారు. నూతన కోర్టులకు సంబంధించి కొత్త భవనాలకు 21 జిల్లాల్లో ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని, కొత్త భవనాలకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సిఎం సహకరించారని, అడిగిన వెంటనే ఆర్బిట్రేషన్ సెంటర్‌కు భవనం, స్థలం కేటాయించారని వివరించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం కూడా దక్కాలని, కొత్త జ్యుడీషియల్ కోర్టులకు అనుగుణంగా సిబ్బంది కూడా పెరగాలన్నారు. కమర్షియల్ వివాదాల కోర్టులను పెంచాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో క్రమపద్ధతిలో న్యాయవ్యవస్థ పటిష్టతకు కృషి జరుగుతోందన్నారు. ఈక్రమంలో ఐటీ రంగం సేవలను సైతం రాష్ట్ర న్యాయశాఖ వినియోగించుకోవాలని సూచించారు.
ఇదే తొలిసారి ః
దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ కొత్త అధ్యాయానికి తెర తీసిందన్నారు. జిల్లాల న్యాయవ్యవస్థ ఇంతలా వికేంద్రీకరణ కావడం ఇదే తొలిసారని, చాలాకాలం తర్వాత న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరిగిందన్నారు. న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ దిశగా తొలి అడుగుపడిందని, ఒకేసారి 23 జిల్లా కోర్టుల ఏర్పాటు చరిత్రలో నిలుస్తుందన్నారు. జిల్లాల విభజనతో కేసుల బదిలీ సులభం అవుతోందని ఎన్‌వి రమణ తెలిపారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి కొన్ని సూచనలు చేస్తున్నానని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్తున్నారని, ఉన్నతస్థాయిలో ఉన్నవారిపై అభాండాలు వేయడం సరికాదన్నారు. న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని చురకలంటించారు. పరిధి దాటినవారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్దమని, ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం రాజ్యాంగబద్ధంగా నిబద్ధతతో పని చేస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరం అని సిజెఐ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తాను సంవత్సర కాలం నుంచి భారత ప్రధాన న్యయామూర్తిగా శాయశక్తుల కృషి చేస్తున్నానని తెలిపారు. న్యాయ వ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందని, దాని పట్ల విశ్వాసం కలిగించాలని, అవగాహన పెంచాలని, సమాజంలో ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో పర్యటించితెలియజేశానని చెప్పారు.
సిఎం, సిజెఐకి కృతజ్ఞతలు:
రాష్ట్రంలోని నూతన జిల్లాలలో కోర్టుల ఏర్పాటు పట్ల న్యాయవాదులు సిఎం కెసిఆర్, సిజెఐ ఎన్‌వి రమణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు టపాకాయలు కాల్చి స్వీట్లను పంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కొంతం గోవర్ధన్ రెడ్డీ, సిహెచ్ ఉపేంద్ర, మంత్రిరవి, అరుణ్ కుమార్, తుూడి శ్రీధర్ రెడ్డీ, తిరుమల్ రావు, చక్రధర్ రెడ్డి, నరేందర్‌లు పాల్గొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతంగా జరుగుతుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

CJI NV Ramana inaugurates 23 District Courts in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News