మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, పక్కన ఎంపి జోగినపల్లి సంతోష్
దేశంలోని న్యాయమూర్తులకు సిజె ఎన్‌వి రమణ పిలుపు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి కార్యక్రమం, సంతోష్‌కు ప్రశంస
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో రాజ్‌భవన్‌లో మంగళవారం సిజెఐ ఎన్వీరమణ మొక్క నాటారు. భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మొక్కలను మించిన బహుమతి లేదన్నారు. ‘భూమాతను గ్రీనేజ్‌తో రక్షించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. దేశం సుస్థిరాభివృద్ధిని అందివ్వాలంటే పచ్చదనాన్ని మించిన కార్యక్రమం మరొకటి లేద’ని సిజెఐ అన్నారు. మొక్కలను నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని సిజెఐ ఎన్వీరమణ అన్నారు. ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని సిజెఐ కొనియాడారు. కార్యక్రమంలో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు, ఎంఎల్‌సి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు వృక్షవేదం పుస్తకాన్ని ఎంపి సంతోష్ కుమార్ బహుకరించారు.
మొక్కలు నాటాలి.. సంరక్షించాలి : ఎంపి బిపి సరోజ్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మచలీ షహర్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు బిపి సరోజ్ మంగళవారం ఢిల్లీలోని నార్త్ ఎవిన్యూలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు.