మేం రాజ్యాంగానికే జవాబుదారి పార్టీలకు కాదు
ఎన్నారైల సభలో ప్రధాన న్యాయమూర్తి
న్యూయార్క్: న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుంది, రాజ్యాంగానికే జవాబుదారి అవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ స్పష్టం చేశారు. భారతదేశంలో అధికారంలో ఉండే పారీల్టు తమ ప్రభుత్వ చర్యలు లేదా నిర్ణయాలకు న్యాయవ్యవస్థ ఆమోదం ఉండాల్సిందే అనుకుంటాయి. ఇదే దశలో ప్రతిపక్ష పార్టీలు జుడిషియరీ నుంచి తమ రాజకీయ ప్రయోజనాలు సాగే రూలింగ్‌లు ఆశిస్తుంటాయి. ఈ రెండింటిని న్యాయవ్యవస్థ నుంచి ఆశించరాదని ప్రధాన న్యాయమూర్తి తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రవాసభారతీయుల సంఘం జరిపిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగించారు. విలువైన రాజ్యాంగంలో దేశంలోని ప్రతి కీలక వ్యవస్థకు నిర్ధేశిత బాధ్యతలు కేటాయించారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతూ ఉన్నా ఇప్పటికీ ప్రజలకు ఆయా వ్యవస్థల బాధ్యతలు కట్టుబాట్లు ఏమిటనేది తెలియదని, ఇది తనకు అసంతృప్తి కల్గిస్తోందని తెలిపారు. రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల ప్రజలకు సరైన అవగావహనలేకపోవడంతోనే ఇప్పటి లోపభూయిష్ట ఆలోచనా విధానానికి దారితీసిందని తెలిపారు. దేశంలో రాజ్యాంగపరమైన సంస్కృతిని పెంపొందించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి , ప్రతి సంస్థ బాధ్యతల పట్ల అవగావహన కల్పించాలి. అందరి ప్రాతినిధ్యమే ప్రజాస్వామ్యానికి ప్రతీక అవుతుందని సిజెఐ తెలిపారు.
బిలియనీర్లు కావచ్చు కానీ ప్రశాంతతోనే ఆనందానుభవం
ఎంతో దూరం నుంచి వచ్చి కష్టపడి తమ ప్రతిభతో భారతీయులు మిలియనీర్లు కొందరు బిలియనీర్లు కావచ్చు. అయితే వారు తమ సంపద వారి వనరులను అనుభవించడానికి తప్పనిసరిగా ప్రశాంతత అవసరం అని ఇక్కడి ఎన్నారైలను ఉద్ధేశించి చీఫ్ జస్టిస్ తెలిపారు. మీ కుటుంబం, తల్లిదండ్రులు, మీ పూర్వపు సమాజం బాగోగుల గురించి పట్టించుకోకపోతే మీరు ఇక్కడ ఎంత సంపాదించినా, ఏ హోదాలో ఉన్నా లాభం ఏమిటని ప్రశ్నించారు. మీరు గడించే ఆదాయం కీర్తి ఇతర అంశాలకు సరైన విలువ కేవలం మీ సహృదయత తద్వారా దక్కే మానసిక ప్రశాంతతోనే సాధ్యం అవుతుందన్నారు. మీ ఇక్కడి విజయం ఎంత ఉన్నతం అయినప్పటికీ, మీకు మీ జన్మభూమిలో దక్కే ఆదరణ గౌరవం, ఆత్మీయతనే కీలకం అవుతుంది. మీ వాస్తవిక విజయానికి మీ మానసిక ప్రశాంతతనే గీటురాయి అవుతుందని తెలిపారు.
CJI NV Ramana speech at NRI Meeting in New York