సొరాబ్జీ, అశోక్ దేశాయ్‌లకు సిజెఐ నివాళి
న్యూఢిల్లీ: న్యాయకోవిదులు, గత ఏడాది కన్ను మూసిన మాజీ అటార్నీ జనరల్స్ సోలీ జె సొరాబ్జీ, అశోక్ హెచ్ దేశాయ్‌లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శుక్రవారం ఘన నివాళి అర్పించారు. న్యాయశాస్త్రానికి వారు అందించిన సేవలు, సాధించిన విజయాలను వర్ణించడం కష్టమని పేర్కొన్నారు. కేశవానంద భారతి, ఎస్‌ఆర్ బొమ్మైలాంటి పలు చరిత్రాత్మక కేసులలో వాదించిన 91 ఏళ్ల సొరాబ్జీ కరోనాతో గత ఏడాది ఏప్రిల్ 30న ఆస్పత్రిలో కన్ను మూశారు. అలాగే 88 ఏళ్ల దేశాయ్ గత ఏడాది ఏప్రిల్ 13న మృతి చెందారు. ఎఆర్ అంతులే, నర్మదా డ్యామ్ కేసు, సల్వాజుడుం, గే సెక్స్ పట్ల వివక్షలాంటి పలు ప్రముఖ కేసుల్లో ఆయన వాదించారు. సుప్రీంకోర్టు కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో శుక్రవారం వీరి సంస్మరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా సిజెఐ రమణ మాట్లాడుతూ సోలీ సొరాబ్జీ అనుభవం నైపుణ్యం అసమానమైనదని అన్నారు. ఈ దేశ న్యాయశాస్త్రంపై ఆయన చెరిగిపోని ముద్ర వేశారని అన్నారు. పద్మ విభూషన్ పురస్కారం అందుకున్న సొరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారని, రెండు సార్లు దేశానికి అటార్నీ జనరల్‌గా సేవలందించారని ఆయన తెలిపారు. ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన ఏడు దశాబ్దాలకు పైగా సేవలందించారని కొనియాడారు. దేశాయ్ గురించి మాట్లాడుతూ సొలిసిటర్ జనరల్‌గా , అటార్నీ జనరల్‌గా కూడా సేవలందించిన అతికొద్ది మంది మందిలో ఆయన ఒకరని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా మాట్లాడారు.