నేటి కాలానికి, ప్రజల అవసరాలకు తగినట్లుగా చట్టాలను పునఃపరిశీలించి, సంస్కరించాలి
ఆచరణాత్మకంగా మార్చాలి : కటక్ సభలో సిజెఐ ఎన్.వి. రమణ
కటక్: నేటి కాలానికి, ప్రజల అవసరాలకు తగినట్లుగా ఉండేందుకు వీలుగా చట్టాలను పునః పరిశీలించి వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. అప్పుడే అవి ఆచరణాత్మక వాస్తవాలకు తగినట్లుగా ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు. శనివరం ఇక్కడ ఒడిశా రాష్ట్ర లీగల్ సర్వీస్ అతారిటీ కొత్త భవనాన్ని సిజెఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన చట్టాలు మన ఆచరణాత్మక వాస్తవాలకు తగినట్లుగా ఉండాలి, ఇప్పుడున్న నిబంధనలను సరళం చేయడం ద్వారా ఎగ్జిక్యూటివ్ ఈ కృషికి తగు విధంగా తోడ్పడాలి’ అని అన్నారు. రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఒకటిగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
అప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థ చట్టాలను రూపొందించే పాత్రలోకి ప్రవేశించదని, కేవలం చట్టాలను అమలు చేసి, వాటికి నిర్వచనం చెప్పే పాత్రను మాత్రమే నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆయన అన్నారు. దేశానికి చెందిన మూడు వ్యవస్థలు చట్ట సభలు, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ కలిసికట్టుగా పని చేస్తేనే ప్రజలకు న్యాయం అందించడానికి అడ్డంకిగా ఉండే నిబంధనలను తొలగించగలుగుతాయని కూడా జస్టిస్ ఎన్ రమణ అన్నారు. భారతీయ న్యాయవ్యవస్థ రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అంటూ, వాటిలో మొదటిది న్యాయాన్ని అందించే వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి కొరవడడమన్నారు. ‘స్వాతంత్య్రం సిద్ధించి 74 ఏళ్లు గడిచిన తర్వాత కూడా సంప్రదాయ జీవన విధానాన్ని పాటిస్తున్న సంప్రదాయ, వ్యవసాయ సమాజాలు కోర్టులను ఆశ్రయించడానికి వెనుకాడుతున్నాయన్నారు.
మన న్యాయస్థానాలు పాటించే పద్ధతులు, నిబంధనలు, భాష తమకు దగ్గరగా లేవని వారు భావిస్తున్నారు’ అని ఆయన అంటూ, చట్టాల్లోని సంక్లిష్టమైన భాష, న్యాయాన్ని అందించే ప్రక్రియ కారణంగా సామాన్యుడు తన ఫిర్యాదుపై పట్టును కోల్పతున్నాడనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ కారణంగానే న్యాయాన్ని కోరుకునే వారు తరచూ తాము ఈ వ్యవస్థకు బయటి వ్యక్తులమని ఫీలవుతున్నారన్నారు. కఠోర వాస్తవం ఇలా ఉన్నప్పటికీ భారతీయ న్యాయవ్యవస్థ సామాజిక వాస్తవాలను, దాని ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవడంలో విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ విచారకరమైన విషయం ఏమిటంటే అన్ని వాస్తవాలు, చట్టాలను న్యాయస్థానాలు క్షుణ్ణంగా పరిశీలించే సమయానికి చాలా వరకు సమయం గడిచిపోతుంది. జనం తమ ఫిర్యాదులను న్యాయస్థానాలకు తీసుకు వస్తున్నారు కానీ చివరికి అది మరో ‘కేసు’గా మిగిలిపోతోంది’ అని సిజెఐ వ్యాఖ్యానించారు.