మీడియా తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం
ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆందోళన
పత్రికలు ఇప్పటికీ జవాబుదారితనంతో
టీవీ ఛానల్స్ అజెండాల చలాయింపులు
సోషల్ మీడియాతో విద్వేష ప్రచారాలు
రాంచీ: మీడియా తనదే వాదన తనదే తీర్పు తరహాలో కంగారూకోర్టులను నడిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని ప్రధాన న్యాయమూర్తి సిజె రమణ పేర్కొన్నారు. జస్టిస్ సత్యబ్రత సిన్హా సంస్మరణ ప్రసంగంలో శనివారం ఆయన ఇక్కడ మాట్లాడారు. మీడియా వ్యవహార శైలి క్రమేపీ అదుపు తప్పుతోంది. నిజనిర్థారణలు లేకుండా తమ అజెండాలను నిర్ధేశించుకుని వెలువరించే వార్తాకథనాలు మీడియా ద్వారా చివరికి కంగారూకోర్టుల నిర్వహణ, వ్యక్తులు లేదా సంస్థల తపొప్పులను వారే నిర్థారించి వారే తీర్పు వెలువరించే తీరుకు మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్వస్థతను ఈ పెడధోరణి క్షీణింపచేస్తుందని అన్నారు. జస్టిస్ సిన్హా సంస్మరణ ప్రసంగాల ప్రక్రియ ప్రధాన న్యాయమూర్తి తొలి ప్రసంగంతోనే ఆరంభం అయింది. మీడియా ట్రయల్స్‌తో న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, సముచిత నిర్వహణ దెబ్బతింటోందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు వాటి నిజాలను నిగ్గు తేల్చడానికి మీడియా స్థాయి స్పందనలు ప్రాతిపదిక కాకూడదు.
మీడియా కోర్టుల ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇక న్యాయస్థానాలు తేల్చే నిజాలు వెలువరించే తీర్పుల సంతి ఏమిటని సిజెఐ ప్రశ్నించారు. అంశాలను ఎంచుకుని వాటిని అజెండాగా మార్చుకుని విచారణల తరహాలో మీడియా స్పందిస్తూ రావడం చివరికి తీర్పులు చెప్పేది మీడియానే, నిజాలు తేల్చేది మీడియానే అనుకునే స్థాయి ఏర్పడుతోందని, ఇది ప్రజస్వామ్యానికి చేటుగా పరిణమిస్తుందని సిజెఐ తెలిపారు. పత్రికలు ప్రింట్ మీడియా ఇప్పటికీ కొంత మేర బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో వ్యవహరిస్తోంది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా కట్టుతప్పింది. జవాబుదారితనం తీసుకోవడం లేదు. దీనిని వారు గాలికి వదిలేసినట్లు ఉందని టీవీ ఛానల్స్ తీరుపై వ్యాఖ్యానించారు. ఇక అన్నింటికి మించి సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలపై పనిగట్టుకుని ప్రచార తరహా స్పందన వెలువడుతోందని, ఇది కేవలం ప్రజాస్వామ్యానికే కాకుండా సామాజికంగా కూడా భయానక విషయం అవుతోందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో మీడియాకు నియంత్రణ ఉండాలనే వాదన బలోపేతం అవుతోందని, దీనిని ఇప్పటికైనా గుర్తించి పలు రకాల మీడియా మాధ్యమాలు స్వీయ నియంత్రణను పాటిస్తూ ప్రజాస్వామిక పరిరక్షణకు , వ్యవస్థల పరస్పర ఆదరణకు వీలు కల్పించాల్సి ఉందని ప్రధాని న్యాయమూర్తి తెలిపారు. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యతాయుతంగా మెదలాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
CJI Ramana Criticises Media Kangaroo Courts