న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఆదివారం కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్ ఎలెనీ కౌనలకిస్‌ను కలుసుకున్నారు. అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కో లో భారత కాన్సుల్ జనరల్ అధికారిక నివాసాన్ని గవర్నర్ కౌసలకిస్ అధికారికంగా ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా మహాత్మాగాంధీ జీవిత చరిత్ర గ్రంధాన్ని కౌసలకిస్‌కు రమణ బహూకరించారు. జర్మనీని సందర్శించిన తరువాత సిజెఐ రమణ తన భార్య శివమాలతో అమెరికాలో పర్యటిస్తున్నారు. అంతకు ముందు రోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇండియన్ అమెరికన్లు జరిపిన సన్మాన సభలో సిజెఐ రమణ ప్రసంగిస్తూ భారత స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లయినా ప్రతిసంస్థకు రాజ్యాంగం కేటాయించిన పాత్రలు, బాధ్యతలను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతి ప్రభుత్వ చర్య న్యాయమైన ఆమోదానికి అర్హమైనదనే నమ్ముతుందని, అదే సమయంలో ప్రతిపక్షాలు తమ రాజకీయ స్థితిని, కారణాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్తుందని భావిస్తుంటాయని, కానీ న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని వివరించారు. దీనికి ముందు వాషింగ్టన్ డిసిలో భారత సంతతిని ఉద్దేశించి సిజెఐ ప్రసంగించారు.