న్యాయం దక్కేదెలా? : సిజెఐ ఎన్.వి.రమణ
ముంబై : దేశంలోని న్యాయస్థానాలలో మౌలిక ఏర్పాట్లు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సక్రమ న్యాయం శీఘ్రగతిని చేరడంలో కోర్టులలో మౌలిక సాధనాసంపత్తి అవసరం. అయితే ఈ ఏర్పాట్ల విషయంలో ఇప్పటికీ తాత్కాలిక, అనాలోచిత, అసమగ్ర ప్రణాళికల చర్యలు శోచనీయఅని తెలిపారు. న్యాయం అందరికీ అందే ప్రక్రియలో ఇటువంటి పరిణామాలు తలెత్తడం ఎంతవరకు భావ్యం అని జస్టిస్ రమణ ప్రశ్నించారు. బొంబాయి హైకోర్టు అనుబంధం అయిన ఔరంగాబాద్ బెంచ్‌కు సంబంధించి ఏర్పాటు అయిన రెండు అనుబంధ భవనాల సముదాయాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయవ్యవస్థకు కీలకమైన మౌలిక ఏర్పాట్లు అని అరకొరగా పద్ధతిలేకుండా ఉంటున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మనం సాధించే విజయాలు ఇతరత్రా గణనీయ పరిణామాలు ఇటువంటి అంశాల పట్ల శీతకన్నుకు దారితీయకూడదని సూచించారు. పలు న్యాయస్థానాలలో కనీస సౌకర్యాలు లేవు. దీనితో న్యాయవ్యవస్థ నిర్వహణలో పలు క్లిష్టతలు ఎదురవుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి ఈ వేదిక నుంచి మరోసారి ప్రస్తావించారు. కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థలోనే ఉన్నాయి. దెబ్బతిని ఉన్న వాటిలోనే కోర్టుల నిర్వహణ జరుగుతోందని తెలిపారు. సరైన ఏర్పాట్లు లేకుండా న్యాయ నిర్వహణ ఏ విధమైన చిక్కులు ఎదుర్కొంటుందనేది గమనించాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి తమ బాధ వ్యక్తం చేశారు.
ఇక నూతన భవనాల నిర్మాణాలు , విస్తరణ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించిన అనుబంధ భవనాలు రూపకల్పన 2011లో జరిగింది. ఇప్పుడు వీటి ప్రారంభోత్సవం జరిగిందని ఇంతకంటే జాప్యానికి ఉదాహరణలు అవసరమా? అని ప్రశ్నించారు. నిర్మాణాలకు పది ఏండ్లు పట్టడం ఓ ఆలోచన రూపం దాల్చడానికి ఇంత సమయం వేచి చూడాల్సి ఉండటం తీవ్రస్థాయి సమస్య అని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే మన న్యాయవ్యవస్థలోని మౌలిక సాధనాసంపత్తికి సంక్రమించుకుని ఉన్న చేటు లేదా తీవ్రస్థాయి జటిల సమస్యగా ఇటువంటి పరిణామం ఉందని సిజెఐ తెలిపారు. ప్రజలు తమ హక్కుల గురించి అవగావహన పెంచుకుంటున్నారు. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తున్నారు. ఈ తరుణంలో వారికి న్యాయవ్యవస్థ మరింతగా ఇప్పటికన్నా సమగ్రరీతిలో అందుబాటులో ఉండాలి. అయితే అత్యవసర ప్రాతిపదికన నిర్మాణపనులు జరగాల్సిన వ్యవస్థ జాప్యాలతో కొట్టుమిట్టాడాల్సి రావడం దారుణం అన్నారు. జనం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పురోగతి క్రమంలో వారి మౌలిక న్యాయ అవసరాలను తీర్చే విధంగా సమాయత్తంతో ఉండటానికి మనకు ఎంతకాలం పడుతుందని నిలదీశారు. న్యాయవ్యవస్థను కేవలం న్యాయవ్యవస్థ పరిధిలోని విషయంగానే పరిగణించరాదు. సమర్థవంతమైన జుడిషియరీతో దేశ ఆర్థికవ్యవస్థ సమర్థవంత పురోగతికి దోహదం చేస్తుందని తెలిపారు.