వామపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వామపక్షాలు శనివారం డిమాండ్ చేశాయి. ప్రభుత్వం దీనిపై పెదవి విప్పకపోతే నేరాన్ని అంగీకరించినట్లేనని వామపక్షాలు వ్యాఖ్యానించాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్ వేదికగా కేంద్రంపై ప్రశ్నలు సంధిస్తూ ఈ సైబర్ ఆయుధాన్ని ఎందుకు కొన్నారో, దీన్ని ఉపయోగించడానికి ఎవరు అనుమతి ఇచ్చారో, దీనికి ఎవరిని లక్షంగా ఎంచుకున్నారో, ఇందుకు సంబంధించిన నివేదికలు ఎవరికి వెళ్లాయో ప్రభుత్వం అఫిడవిట్‌లో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కీలకమైన అంశంలో ప్రభుత్వం మౌనం దాల్చడం నేరాన్ని అంగీకరించనట్లే అవుతుందని ఆయన అన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పందిస్తూ ప్రభుత్వం పార్లమెంట్‌కు కూడా చెప్పకుండా పెగాసస్ స్పైవేర్‌పై నిజాలు దాస్తోందని, ఇప్పుడు ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాల్సిందేనని, మౌనంగా ఉంటే తప్పుడు చర్యలకు పాల్పడినట్లు అర్థమవుతుందని ఆయన అన్నారు.