ఎన్‌టిఎజీఐ చీఫ్ డాక్టర్ అరోరా వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో బూస్టర్ డోసు కాకుండా ముందు జాగ్రత ( ప్రికాషన్) డోసులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా బూస్టర్ డోసు విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ బూస్టర్ డోసు ఆవశ్యకతపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే నాలుగో డోసు ఇస్తుండగా, బ్రిటన్, కెనడా, కూడా ఈమేరకు ప్లాన్ చేస్తున్నాయన్నారు. ప్రతిదేశం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తెలిసినప్పటికీ బూస్టర్ డోసు వెనుక ఉన్న సైన్స్‌పై మన అవగాహనలో కొంత గ్యాప్ కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కొద్ది రోజులు దేశం లోని ఆస్పత్రుల్లో చేరికలను గమనించాలని, ఎవరికి ముప్పు ఎక్కువగా ఉందో గుర్తించాలని, ఆ తర్వాతే బూస్టర్ విషయంలో ముందుడుగు వేస్తాం అని ఆయన వెల్లడించారు.
ఒమిక్రాన్‌పై కచ్చితమైన అవగాహన వచ్చేందుకు మరో రెండు మూడు వారాలు పడుతుందన్నారు. దేశంలో 4.5 కోట్ల మంది గర్భిణులు, గర్భం దాల్చాలని భావిస్తున్నవారు ఉన్నారని, వారిలో 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఇప్పటివరకు టీకాలు వేయించుకున్నారని అరోరా ఆందోళన వెలిబుచ్చారు. గర్భిణులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని, ఈ విషయాన్ని వారు అర్ధం చేసుకోవాలని, ఇప్పటివరకు 30 లక్షల మంది గర్భిణులకు టీకాలు ఇచ్చామని చెప్పారు. తల్లీబిడ్డకు వ్యాక్సిన్ సురక్షితమేనని డేటా చూపుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో టీకా వేయించుకోడానికి ముందుకు రావాలని సూచించారు. దేశంలో 44 కోట్లకు పైగా బాలబాలికలు ఉన్నారని, ఇప్పుడు 1518 ఏళ్ల వారికి టీకా ఇస్తున్నామని, క్రమక్రమంగా అవసరమైన వారందరికీ టీకా పంపిణీ చేస్తామని చెప్పారు.