సిటిబ్యూరోః ఇద్దరు పహిల్వాన్ల మధ్య ఏర్పడిన ఘర్షణ దాడులకు దారితీసిన సంఘటన ఎల్‌బి స్టేడియంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బషీర్‌బాగ్‌లోని ఎల్‌బి స్టేడియంలో మూడు రోజుల నుంచి మోదీ కేసరి దంగల్(కుస్తీ) పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం జరిగి, ఇది ఘర్షణకు దారితీసింది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఇరువార్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.కూర్చీలు విసురుకోవడంతోపాటు ఎగిరి ఒకరిపై ఒకరు దూకారు.
పహిల్వాన్ల దాడులతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ సంఘటనలో పలువరు ప్రేక్షకులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోటీల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఎవరు ఎవరిపై దాడి చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల పాట జరగాల్సిన పోటీలు ఘర్షణ వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు.