నేపాల్‌లోని ఖాట్మండులో రాచరిక అనుకూల వాదులకు, పోలీసులక మధ్య శుక్రవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనలో రాచరికవాదులు రాళ్లు రువ్వడం, ఓ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టడం, దుకాణాలు లూటీ చేయడం, వాహనాలను తగులబెట్టడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు చనిపోయారు, 30 మందికి గాయాలయ్యాయి.దాంతో జిల్లా అధికారులు ఐదుగంటల కర్ఫూ విధించారు. ఈ కర్ఫూ రాత్రి 10 వరకు ఉంటుంది. ఖాట్మండుకు చెందిన సబిన్ మహర్జన్(29) బుల్లెట్ గాయానికి గురై ఆసుపత్రిలో చనిపోయాడు. అవెన్యూస్ టెలివిజన్‌కు చెందిన ఓ ఫోటో జర్నలిస్ట్ సురేశ్ రజక్ టింకూన్ ప్రాంతంలో ఓ బల్డింగ్ మీద నుంచి వీడియో షూట్ చేస్తుండగా,
ఆ బిల్డింగ్ నుంచి పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని తలచి నిరసనకారులు ఆ బిల్డింగ్‌కు నిప్పు పెట్టారు. దాంతో ఆ బిల్డింగ్ నిప్పుల్లో చిక్కుకోగా ఫోటో జర్నలిస్ట్ సురేశ్ రజక్ కూడా కాలి చనిపోయాడు. తర్వాత పోలీసులు ఆ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఓ కాలిన శరీరాన్ని కనుగొన్నారు. అయితే అది సురేశ్‌దేనా అన్నది అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. నిరసనకారులు బనేశ్వర్‌లోని సిపిఎన్ యూనిఫైడ్ సోషలిస్ట్‌స్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఖాట్మండులోని పలు ప్రాంతాల్లో కర్ఫూ విధించారు. టికెట్ ఉంటేనే విమానాశ్రయానికి అనుమతిస్తున్నారు.
నిరసనకారులు టింకునె ప్రాంతంలో మాజీ రాజు జ్ఞానేంద్ర షా, జాతీయ జెండా పట్టుకుని నిరసనలు చేపట్టారు. ‘రాజా రండి, దేశాన్ని కాపాడండి… అవినీతి ప్రభుత్వం డౌన్ డౌన్… మాకు రాచరిక ప్రభుత్వమే మళ్లీ కావాలి’ అంటూ నినాదాలు చేశారు.ఇదిలావుండగా దేశంలో చెలరేగుతున్న అశాంతి పరిస్థితి చర్చించేందుకు ప్రధాని కె.పి.ఒలి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాట్మండులో అశాంతి వాతావరణాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. నేపాల్‌లో 2008లో 240 ఏళ్ల రాచరిక పాలనకు ఉధ్వాసన పలికారు. అక్కడి హిందూ రాజ్యాన్ని సెక్యులర్, ఫెడరల్, డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా ప్రకటించారు. సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్ చీఫ్ పుష్పకమల్ దహల్ ప్రచండ ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ రాచరిక అనుకూల శక్తులను విమర్శించారు.