Monday, December 23, 2024

రాముడి విగ్రహ ఊరేగింపులో ఘర్షణ.. రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

కలబురగి(కర్నాటక): ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగిన మరుసటి రోజే మంగళవారం కర్నాటకలోని కలబురగి జిల్లాకు చెందిన వాడి పట్టణంలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చెలరేగడంతో కర్నాటక ప్రభుత్వం పట్టణంలో నేషధాజ్ఞలు విధించింది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా ముందు జాగ్రత్తగా జనవరి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వాడి పట్టణంలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు సందర్భంగా వాగ్వాదం చెలరేగి రెండు వర్గాల మధ్య రాళ్లు రువ్వుకున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు రెండు వర్గాలకు చెందిన ప్రజలపై స్వల్పంగా లాఠీ చేశారు.

అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని వాడి పట్టణంలో శ్రీరాముడి విగ్రహానికి ఊరేగింపు నిర్వహించినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య కేవలం వాగ్యుద్ధం మాగ్రమే జరిగిందని, అది స్వల్పంగా ఘర్షణకు దారితీయడంతో పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి లేదని, ముందు జాగ్రత్తగా మాత్రమే 144 సెక్షన్ విధించడం జరిగిందని ఆయన తెలిపారు. చిత్తాపూర్ తాలూకాలోని వాడి ప్రాంతలో జనవరి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా, కలబురగి పట్టణ శివార్లలోని కొట్నూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేయడాన్ని ఖండిస్తూ వివిధ దళిత సంఘాలు నిరసనలు చేపట్టడంతో కలబురగి జిల్లాలోని అనేక ప్రాంతాలలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి కొందరు దుండగులు చెప్పుల దండ వేశారని నిరసనకారులు ఆరోపించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి తెలిపారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News