తుపాకులతో బెదిరించిన భద్రతా సిబ్బంది
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో సోమవారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన దిలీప్‌ఘోష్‌కు భంగపాటు జరిగింది. టిఎంసి మద్దతుదారులు కొందరు ఘోష్‌ను వెనక్కు నెట్టివేయడమే కాక, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోటీ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ నియోజక వర్గంలో టిఎంసి, బిజెపి నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సెప్టెంబర్ 30 న జరగనున్న ఈ ఉప ఎన్నిక ప్రచారానికి సోమవారం ఆఖరి రోజు.
ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బందిని టిఎంసి కార్యకర్తలు నెట్టివేయడంతో భద్రతా సిబ్బంది తుపాకులు తీసి టిఎంసి కార్యకర్తలను బెదిరించడానికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘోష్ తన ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లి పోయారు. బిజెపి అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్‌కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన బిజెపి ఎంపి అర్జున్‌సింగ్‌కు కూడా టిఎంసి నుంచి నిరసన ఎదురైంది. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. దీనిపై టిఎంసి సీనియర్ నేత మదన్ మిత్రా స్పందిస్తూ ప్రచారం చేసుకునే హక్కు ప్రతి వారికి ఉంటుందని, అయితే ఆయుధంతో ప్రజలను బెదిరించకూడదని విమర్శించారు. ఎంపిలు, జాతీయ స్థాయి నాయకులపై దాడి జరుగుతున్నా పోలీసులు ఏమీ చేయకపోవడాన్ని అర్జున్ సింగ్ ఆక్షేపించారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లు సృష్టించడానికి బిజెపి ప్రజలను కవ్విస్తోందని రాష్ట్ర మంత్రి , టిఎంసి నేత ఫిర్హద్ హకీం ఆరోపించారు.