Thursday, January 23, 2025

హర్యానాలో భగ్గుమన్న ఘర్షణలు

- Advertisement -
- Advertisement -

మేవత్ ( హర్యానా) : హర్యానా మేవత్ రీజియన్ నుహ్ జిల్లా నంద్ గ్రామ సమీపాన సోమవారం విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. విహెచ్‌పి కార్యకర్తలు చేపట్టిన ఈ ర్యాలీ నంద్ గ్రామానికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకొని, రాళ్లతో దాడి చేయడంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్‌లు మొదట టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంకా పరిస్థితిని అదుపు లోకి తీసుకురాడానికి కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం అప్రమత్తమై పారామిలిటరీ బలగాలను హుటాహుటిన రంగం లోకి దింపింది.

పరిస్థితిని అదుపు చేసేందుకు హర్యానా పోలీస్‌లు రాష్ట్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గోరక్షణ దళం, బజరంగ్ దళ్‌కు చెందిన మోను మనేసర్ రెండు రోజుల క్రితం ఈ యాత్రలో పాల్గొనాలని, బజరంగ్ దళ్ కార్యకర్తలకు పిలుపునిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. ఫిబ్రవరిలో బివండీలో జరిగిన ఇద్దరు ముస్లిం వ్యక్తుల హత్య కేసులో మోను నిందితుడు. ర్యాలీ రోజున తాను కూడా మేవత్‌లో ఉంటానని, దమ్ముంటే ర్యాలీని అడ్డుకోవాలని సవాల్ విసిరాడు. మరోవర్గాన్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోలో మాట్లాడాడు. ఇదే సోమవారం నాటి ర్యాలీలో ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాహనాలు తగులబడుతుండడం వీడియోలో కనిపించింది.

ఉద్రిక్తతల నేపథ్యంలో మొబైల్ , ఇంటర్నెట్ సేవలను ఆగస్టు 2 వరకు నిలిపివేశారు.144 సెక్షన్ అమలు లోకి తెచ్చారు. హర్యానా హోం మంత్రి అనిల్ విజి ర్యాలీలో రాళ్లు రువ్వే సంఘటన జరిగిందని నిర్ధారించారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులు పోలీస్‌ల నుంచి అనుమతి తీసుకునే ర్యాలీ చేట్టారని పేర్కొన్నారు. రోడ్లన్నీ దిగ్బంధం కావడంతో సమీప జిల్లాల నుంచి పోలీస్ దళాలను, పారా మిలిటరీని హెలికాప్టర్ల ద్వారా సంఘటన స్థలానికి దింపవలసి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అలజడులకు తావీయవద్దని ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా ప్రజలను అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News