Monday, December 23, 2024

‘ఇండియా’లో ఇంటిపోరు

- Advertisement -
- Advertisement -

బిజెపిని గద్దె దింపే సంఘటిత లక్ష్యంతో, దేశం పేరుతో ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమి) బీటలు వారుతున్నదనే శీర్షికతో వార్తలు తరచూ వస్తున్నాయి. ఇవి సహజంగానే బిజెపికి శ్రావ్య సంగీతంగా వినిపిస్తాయి. ప్రతిపక్ష ఐక్యత మీద ప్రజల్లో గల అనుమానాలను పెంచుతాయి. కుక్క తోక వంకర తీర్చలేనిది అనే వెటకారానికి దోహదం చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని, ఎవరికీ సీట్లు పంచి ఇచ్చేది లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ బుధవారం నాడు ప్రకటించారు. అదే సమయంలో పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్ కూడా స్పష్టం చేశారు. దీనితో ‘ఇండియా’ కూటమి భవనం పగుళ్ళు ఇస్తున్న సూచనలు కనిపించాయి. కాంగ్రెస్‌కు ఇవ్వదలచుకొన్న స్థానాల సంఖ్యను వారికి తెలియజేశామని వారు ఇంత వరకు అంగీకారం తెలపలేదని, అందుచేత తాము ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించామని మమత చెప్పేశారు.

ఆమె నుంచి ఈ ప్రకటన వెలువడగానే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా బాంబు పేల్చారు. దెబ్బ మీద దెబ్బ మాదిరి పరిణామంతో ప్రతిపక్ష ఉమ్మడి పోరు ఉత్తమాటేనని అనిపించింది.దేశ వ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాలన్న ప్రతిపాదనను మమత మళ్ళీ ముందుకు తెచ్చారు. ఈసారి మమతా బెనర్జీ మాట కటువుగాను, తదుపరి చర్చలకు తావు లేదన్న స్వరంతోనూ ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ రెండే స్థానాలు గెలుచుకొన్నందున ఇప్పుడు దానికి రెండింటినే ఇస్తామని చెప్పామని తన అభిప్రాయం చెప్పడానికి తామిచ్చిన గడువు దాటి చాలా కాలమైందని, ఇక బేరసారాలకు అవకాశమే లేదని, జాతీయ స్థాయి ప్రతిపక్ష ఐక్యత సంగతిని ఎన్నికల తర్వాతనే ఆలోచిస్తామని కూడా మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.అయితే ‘ఇండియా’ కూటమికి మీరు స్వస్తి చెబుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆ కూటమి ఒక్క పార్టీతో ఏర్పాటైనది కాదని, ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటిగా ఉన్నాయని సమాధానమిచ్చారు.

అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటులో తమకు సహకరిస్తే బెంగాల్‌లో కాంగ్రెస్‌కు మరి రెండు సీట్లు ఇచ్చేవారమని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి రెండు పార్టీల మధ్య సర్దుబాట్లకు పూర్తిగా తలుపులు మూసుకు పోలేదని అనిపిస్తున్నది. మమతా బెనర్జీ ప్రకటనపై కాంగ్రెస్ స్పందనను గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టం కాగలదు. కాంగ్రెస్‌కు బ్రేకులు వేస్తూ దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహం ఏదో తృణమూల్ కాంగ్రెస్ వైఖరిలో ఇమిడి ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీతో సర్దుబాటు సమయంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఇదే మాదిరి సంకటం ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తగ్గి ఉండడం ద్వారా కూటమి పటిష్ఠతకు దోహదపడడం జాతీయ పార్టీల బాధ్యత. అలాగే అంతిమ లక్ష్యాన్ని సాధించడం కోసం తెగేదాకా లాగకుండా సర్దుబాటుకి చోటివ్వడం ప్రాంతీయ పార్టీల విధి. ఏడు మాసాల క్రితం ‘ఇండియా’ కూటమి నెలకొన్నప్పుడే ఇటువంటి ఒడిదుడుకుల పట్ల దాని అగ్రనాయకులందరికీ తగిన అవగాహన ఉండి ఉండాలి. అందుచేత ఇప్పుడు వారు ఇలా బిగుసుకుపోవడం, ఎడమొగం పెడమొగం కావడంలో ఆర్ధం లేదు.

తామంతా కలిసి పోటీ చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన తర్వాత దానిని ఆచరణలో నిరూపించుకోవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. అందుకోసం సీట్ల సర్దుబాటులో ఇచ్చిపుచ్చుకోవలసిన అవసరాన్ని కూటమి నాయకులు గుర్తించకుండా ఉంటారని అనుకోలేము. జరగబోయే లోక్‌సభ ఎన్నికలు దేశగతిని పూర్తిగా వెనక్కి తిప్పాలని మూర్ఖ కంకణం కట్టుకొని ఆ వైపుగా సగం పని కానిచ్చేసిన శక్తులకు, అణుమాత్రమైనా మిగిలివున్న దాని పురోగామి లక్షణానికి పూర్తి ఊపిరులు ఊది సెక్యులర్ ప్రజాస్వామిక భారతాన్ని కాపాడుకోవాలని దీక్ష వహించిన శక్తులకు మధ్య సాగబోతున్న బ్యాలట్ సమరమిది. ఇందులో దీక్షతో పాల్గొంటామని, ఉమ్మడి ఓటుతో బిజెపి కంచుకోటలను కూల్చి సామాజిక న్యాయపాలనను ప్రతిష్టిస్తామని సంకల్పం చెప్పుకొన్నాక ఒకటి రెండు సీట్ల లాభం కోసం కూటమి కోటను కూల్చడం ఎంతమాత్రం తగదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా ‘ఇండియా’ కూటమి పార్టీలు ఇంటి పోరుకు స్వస్తి చెప్పలేకపోడం ఆత్మహత్యాసదృశమే.

ఇప్పటికే తన తొమ్మిదేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులకుతప్ప సాధారణ ప్రజలకు ఇసుమంత మేలు చేయని ప్రధాని మోడీని తిరుగులేని గొప్ప నాయకుడుగా చిత్రించడం ద్వారా సునాయాసంగా హ్యాట్రిక్ సాధించాలని బిజెపి దూసుకుపోతున్నది. ‘ఇండియా’ కూటమికి ఇంకా కనువిప్పు కలగకపోతే ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News