Wednesday, March 19, 2025

21 నుంచి పది పరీక్షలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,58,895 బాలురు, 2,50,508 బాలికలు ఉన్నారు. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం 2650 మంది ఛీఫ్ సూపరిడెంటెండెంట్లు, 2650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు తెలిపారు. విద్యార్థుల కోసం 040 23230942 ఫోన్ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు పరీక్షా కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలలో ఛీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదని అన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదని తెలిపారు. హాల్‌టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్ పెన్సిల్, షార్ప్‌నర్, ఎరాయిజర్, జామెట్రిక్ పరికరాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చని చెప్పారు. ఈ పరీక్షలో ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించినట్లు వెల్లడించారు.

వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు
పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు తెలిపారు. హాల్ టికెట్లను డిఇఒల ద్వారా పాఠశాలలకు పంపించామని, ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు పొందాలని తెలిపారు. వివిధ కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News