లక్నో: పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ప్రశ్నా పత్రం లీక్ కావడంతో బుధవారం జరగవలసి ఉన్న ఉత్తర్ ప్రదేశ్ సెకండరీ స్కూలు బోర్డుకు చెందిన 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం 24 జిల్లాలలో రద్దు చేసింది. ప్రశ్నా పత్రం లీక్‌కు బాధ్యులైన వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఎ) కింద కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయవలసిందిగా ఆయన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఈ సంఘటనను పురస్కరించుకుని బలియా జిల్లాకు చెందిన పాఠశాలల ఇన్స్‌పెక్టర్ బ్రజేష్ మిశ్రాను సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బలియాలో 12వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలుస్తోందని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్ ప్రదేశ్ సెకండరీ విద్యా శాఖ ఇన్‌చార్జ్ మంత్రి గులాబ్ దేవి విలేకరులకు తెలిపారు. 24 జిల్లాల్లోనే పరీక్షను ఎందుకు రద్దు చేశారని విలేకరులు ప్రశ్నించగా ఈ జిల్లాల్లోనే లీకైన ప్రశ్నాపత్రం పంపిణీ జరిగిందని, మిగిలిన 51 జిల్లాల్లో ఇంగ్లీష్ పరీక్ష యథాప్రకారం జరిగిందని ఆమె చెప్పారు.
Class 12 English Question Paper leak in UP