Monday, December 23, 2024

అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు 2023 నోబెల్ అవార్డు

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం : అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ కు లభించింది. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సమగ్రమైన అధ్యయనానికి గాను గోల్డిన్ (77)ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ హాన్స్ ఎల్లెజెన్ వెల్లడించారు.అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న మహిళల్లో గోల్డెన్ మూడో వ్యక్తి కావడం విశేషం. “గత శతాబ్దంలో అనేక అధిక ఆదాయ దేశాల్లో వేతన మహిళల నిష్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఆధునిక కాలంలో కార్మిక రంగంలో ఇది అతిపెద్ద సామాజిక , ఆర్థిక మార్పుల్లో ఒకటి. అయితే స్త్రీపురుష అంతరాలు అలాగే ఉన్నాయి. మహిళల సంపాదనతోపాటు, ఈ వ్యత్యాసార మూలాలను వివరించేందుకు క్లాడియా గోల్డిన్ సమగ్ర అధ్యయనం చేశారు.

క్లాడియా గోల్డిన్ పరిశోధనలు, లేబర్ మార్కెట్‌లో మహిళల చారిత్రక, సమకాలీన పాత్రలపై ఎప్పటికప్పుడు సరికొత్త , ఆశ్చర్యకరమైన వివరాలను అందిస్తాయి.” అని నోబెల్ కమిటీ తెలిపింది. ‘ శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం సమాజానికి ఎంతో ముఖ్యం. ఈ రంగంలో క్లాడియా గోల్డిన్ సాగించిన పరిశోధనలకు ధన్యవాదాలు. వాటి ద్వారా అంతర్లీన కారకాలు, భవిష్యత్తులో ఏ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలో మనకు మరింత తెలిపింది ’ అని అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కమిటీ ఛైర్మన్ జాకోబ్ స్వెన్సన్ పేర్కొన్నారు. క్లాడియా గోల్డిన్ 1946లో న్యూయార్క్‌లో జన్మించారు. షికాగో యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ లోని హార్వర్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ పొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ అవార్డు రావడం తనకు ఆశ్చర్యం , ఆనందం కలిగించాయని గోల్డెన్ తన స్పందన తెలియజేసినట్టు ఎల్లెజెన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే వైద్య, భౌతిక , రసాయన శాస్త్రాలు, సాహిత్యం , శాంతి విభాగాల్లో నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. గతేడాది అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్ డబ్లు డైమండ్, ఫిలిప్ హెచ్. డైబ్‌విగ్‌లకు నోబెల్ అందించారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై సాగించిన కీలక పరిశోధనలకు గాను ఈ అవార్డు ప్రకటించారు. డిసెంబర్‌లో ఓస్లో, స్టాక్‌హోమ్‌లో ఈ నోబెల్ బహుమతి ప్రదానం జరుగుతుంది. విజేతలు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ( దాదాపు ఒక మిలియన్ అమెరికా డాలర్లు) , 18 క్యారెట్ల గోల్డ్ మెడల్, డిప్లొమా అందుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News