జనగాం : ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం దేవరుప్పుల మండలంలోని కోలుకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాలకుర్తి మండలంలోని తొర్రూరు (జే) గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. తరగతుల నిర్వహణ, చేపట్టిన కోవిడ్ నియంత్రణా చర్యల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదాపు 17 మాసాల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం అయినందున ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలపై పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, పంచాయతి కార్యదర్శి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులను ప్రతిరోజు శుభ్రపరచాలని, మంచి నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేపట్టి, పిల్లలకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని, డెంగ్యూ, మలేరియా వ్యాధులు దరిచేరకుండా పాఠశాలల ఆవరణలో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పిచ్చి మొక్కలు, పొదలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాలలకు వచ్చే పిల్లలు, బోధనా, బోధనేతర సిబ్బంది అంతా మాస్క్ లు ధరించాలని, సానిటైజర్, సబ్బులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి పిల్లవానిని ధర్మల్ స్కానర్ తో పరీక్షించి, అనుమతించాలని, లక్షణాలున్న వారిని వెంటనే పరీక్షలకు పంపాలని సూచించారు. పిల్లలను భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని, భోజనాలు, టాయిలెట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని ఆయన అన్నారు. పర్యటనలో మంత్రి పిల్లలతో మమేకమయ్యారు. టీచర్ల బోధన పద్దతిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గురించి వాకబు చేశారు. పిల్లలను మంచి చదువుకోవాలని, చదువుతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని మంత్రి హితబోధ చేశారు. ఉపాధ్యాయులు పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు, విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితరాలు ఉచితంగా అందిస్తున్నట్లు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -