Monday, December 23, 2024

రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్ చిట్

- Advertisement -
- Advertisement -

బారామతిలో వదినా, మరదళ్ల మధ్య పోటీ

ముంబై : లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ. 25 వేల కోట్ల విలువైన కో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం కేసులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు పోలీస్‌లు క్లీన్‌చిట్ ఇచ్చారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన స్కామ్‌కు సంబంధించిన కేసు దర్యాప్తును ముంబై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ముంబై పోలీస్‌లు క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు.

అయితే అందులోని వివరాలు తాజాగా బయటికొచ్చాయి. ఇందులో సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తాము గుర్తించినట్టు పోలీస్‌లు పేర్కొన్నారు. అజిత్‌కు చెందిన జరందేశ్వర్ షుగర్‌మిల్‌కు జారీ చేసిన రుణాల విషయంలో బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ నివేదిక బయటికి రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం , బీజేపీపైనా విపక్షాలు భగ్గుమన్నాయి. “ ఈ కుంభకోణం గరించి గతంలో మోడీ మాట్లాడుతూ పవార్ కుటుంబం మొత్తం అవినీతిపరులని ఆరోపించారు. ఇప్పుడు వారు పార్టీ మారగానే పోలీసులు సునేత్ర పవార్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు.

అంటే బీజేపీపై వాషింగ్ పౌడర్ వ్యాఖ్యలు నిజమేనని మరోసారి రుజువైంది. ” అని శివసేన యూబీటీ నేత ఆనంద్ దూబే ఆరోపించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌ల గురించి ప్రస్తావిస్తూ వారుముఖ్యమంత్రులైనా సరే బీజేపీకి వ్యతిరేకులు కాబట్టి కేసులు , అరెస్ట్‌లు ఉంటాయని, బీజేపీలో చేరితే మంత్రులు,, డిప్యూటీ ముఖ్యమంత్రులై పోతారని ఎంపీ టికెట్లు కూడా ఇస్తారని దూబే వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఎత్తి చూపి వ్యతిరేకిస్తే బీజేపీ చాలా ఆందోళన, ఆవేదన పాలై పోతుందని విమర్శించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటుందని, విపక్షాలపై దాడికి, అరెస్టులకు పాల్పడుతుందని, ఎవరైనా పార్టీ మారి బిజేపీలో చేరితే కేసుల దర్యాప్తు మందకొడై చివరకు క్లీన్ చిట్ లభిస్తుందని విపక్షాలు పదేపదే విపక్షాలు చేసిన విమర్శలకు ఈ క్లీన్‌చిట్ ఆయుధంగా మారింది. విపక్షాలు దీన్ని బిజేపి వాషింగ్ మెషిన్‌గా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా ఎన్నికల్లో సునేత్ర పవార్ ఎన్డీయే తరఫున బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరద్ పవార్ కంచుకోట అయిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆమె మరోసారి బరిలోకి దిగుతున్నారు. దీంతో బారామతిలో ఈ వదినా మరదళ్ల సవాల్ దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. బారామతి పార్లమెంట్ నియోజకవర్గానికి మూడవ దశలో మే 7న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News