Friday, July 5, 2024

భారత మహిళల క్లీన్‌స్వీప్!

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్
బెంగళూరు: దక్షిణాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 40.4 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో అలరించింది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో మంధాన సెంచరీలతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా చెలరేగి ఆడింది. సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మంధాన పరుగుల వరద పారించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (25), వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియా పూనియా (28)లు ఆమెకు అండగా నిలిచారు. ఆరంభం నుంచే మంధాన దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించింది. మంధానను కట్టడి చేసేందుకు సఫారీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన మంధాన 83 బంతుల్లోనే 11 ఫోర్లతో 90 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42) కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 19 (నాటౌట్) కూడా సమన్వయంతో ఆడి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు లౌరా వల్‌వర్డ్, తంజీమ్ బ్రిట్స్ శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 57 బంతుల్లోనే ఏడు ఫోర్లతో 61 పరుగులు చేసింది. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 102 పరుగలు జోడించింది. మరోవైపు బ్రిట్స్ 38 పరుగులు సాధించింది. ఆ తర్వాత భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో అలరించారు. శ్రేయంక పాటిల్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సౌతాఫ్రికా స్కోరును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీప్తి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను తీసింది. అరుంధతికి కూడా రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News