Monday, January 27, 2025

మూదేళ్లలో యమున ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

రెండు వారాలలోపే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనుండడంతో మూడు సంవత్సరాలలో గా యమునా నదిని శుభ్రపరుస్తామని, 1700 అనధికార కాలనీల్లో యాజమాన్య హక్కులు పూర్తిగా కల్పిస్తామని, గిగ్ వర్కర్లు, కూలీల కోసం సంక్షేమ పథకాలు తీసుకువస్తామని బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం వాగ్దానం చేశారు. ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌పై అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడుతూ, ఆయన ‘అబద్ధాలు ఆడుతున్నార’ని, తన వాగ్దానాలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. దేశ రాజధానిలో అతిపెద్ద ఎన్నికల అంశం ‘అబద్ధాల కోరులు, నమ్మకద్రోహుల నుంచి విముక్తి కల్పించడం’ అని అమిత్ షా స్పష్టం చేశారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ పథకం కింద ఢిల్లీ మెట్రోలో అవసరమైన విద్యార్థులకు ఏటా రూ. 4000 వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు కూడా బిజెపి మేనిఫెస్టో వాగ్దానం చేసింది.

ఫిబ్రవరి 5 నాటి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బిజెపి ‘సంకల్ప్ పత్ర’ మూడవ భాగాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి బిజెపి అధికారంలోకి వచ్చిన పక్షంలో 1700 అనధికార కాలనీల్లో నివసిస్తున్నవారికి ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. దీని వల్ల అమ్మకం, కొనుగోలు, నిర్మాణానికి వీలు కలుగుతుందని ఆయన సూచించారు. ఢిల్లీలో నిరుపేదలకు ప్రస్తుతం సాగుతున్న సంక్షేమ పథకాలను బిజెపి నిలిపివేయదని కూడా అమిత్ షా పునరుద్ఘాటించారు. గిగ్ వర్కర్లు, కూలీల కోసం వివిధ కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలమని ఆయన వాగ్దానం చేశారు. బిజెపి గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుందని, రూ. 10 లక్షల బీమా, రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాలు తీసుకువస్తుందని అమిత్ షా తెలిపారు. కేంద్రం ఢిల్లీలో రోడ్ల నిర్మాణంపై రూ. 41 వేల కోట్లు, రైలు మార్గాల నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు, విమానాశ్రయాల కోసం రూ. 21 వేల కోట్లు వెచ్చించిందని అమిత్ షా తెలియజేశారు. నగర మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఉండకపోతే ఢిల్లీ జీవనయోగ్యంగా ఉండేది కాదని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News