Sunday, September 29, 2024

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దు
కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలి
రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్
తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం
ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం
33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి, బలోపేతం చేసే దిశగా పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సామాన్యులకు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుందని అన్నారు. శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నాడు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని, మరింత వేగం పెరగాలని అన్నారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని దిశానిర్ధేశం చేశారు. రెవెన్యూ ఉద్యోగులు మరింత పట్టుదలతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుంది

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడంలోను, వారికి సంక్షేమ పథకాలను అందించడంలోను రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని,అందులో తహశీల్దార్ల పాత్ర అతి ముఖ్యమైనదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని తెలిపారు. ఈ విభాగం సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా లేదా..? అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేదసామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుని,విధి విధానాలు రూపొందిస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు పని చేయాలని పేర్కొన్నారు.

కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతే తహశీల్దార్లపై కేసులు

కలెక్టర్ నుండి అనుమతి తీసుకున్న తర్వాతే తహశీల్దార్ల మీద కేసులు నమోదు చేసేలా రాష్ట్ర డిజిపితో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కోసం నగరంలో ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం హడావుడిగా మండలాల సంఖ్యను పెంచింది కానీ, దానికి తగినట్టుగా కార్యాలయాలను ఏర్పాటు చేయలేదని, చేసిన వాటిలో మౌళిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. అవసరం మేరకు సిబ్బందిని కూడా నియమించలేదని, వీటిని దృష్టిలో పెట్టుకుని తహశీల్దార్ల కార్యాలయాలలో మౌళిక వసతులను కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్, పదోన్నతులు, కోర్టు ఖర్చులు, అద్దె భవనాలు, అద్దె వాహన బకాయిలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనది : నవీన్ మిట్టల్

రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యాఖ్యానించారు. ఈ శాఖ బాగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నాదని తెలిపారు. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న 300 మంది ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్‌మెంట్ ఫైళ్లను మంత్రి క్లియర్ చేశారని వెల్లడించారు. సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దాదాపు రెండు గంటలపాటు వివిధ జిల్లాలనుంచి వచ్చిన తహశీల్దార్లు గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను వాటి వల్ల ప్రజలు ఎదురుకొన్న ఇబ్బందులను భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందని పలు అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పొత్రు, ట్రెసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News