పెద్దపల్లి: స్వచ్ఛ ఓటరు జాబితా తయారు చేయడమే లక్షంగా అధికారులు పని చేయాలని, కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష జరిపారు. ఓటర్ల జాబితా నిష్పత్తి, పురుష, స్త్రీ ఓటర్ల నిష్పత్తి పోలింగ్ కేంద్రాల వారిగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తిరస్కరణ, ఆమోదానికి తగిన కారణాలను స్పష్టంగా తెలుపాలన్నారు. మరణించిన వారి పేర్లను ఫామ్ 7తో తొలగించాలన్నారు.
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు జారీ చేసిన మరణ దృవీకరణ పత్రం ఆధారంగా జా బితా నుంచి తొలగించాలన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే పూర్తి చేసి, వివరాలను బీఎల్‌ఓ యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆరు ఓట్ల కంటే ఎక్కువగా ఒకే ఇంటిలో ఇంటి నెంబర్‌కు ఎన్నికల కోసం సబ్ నెంబర్లు ఇచ్చి ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.
నూతన ఓటర్ల నమోదు జూలై 13 నాటికి పూర్తి చేయాలని, ఆగస్టు 2న డ్రాప్ట్ ఓటరు జాబితా ప్రచురించాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ పకడ్బందీగా స్వచ్చ ఓటరు జాబితా రూపకల్పన దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓలు వెంకట మాధవరావు, వీర బ్రహ్మచారి, తహసిల్దార్లు, ఎలక్షన్ డీటీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.