Saturday, November 16, 2024

మోడీకి నాజీలకు చాలా పోలికలు: అమెరికన్ ప్రొఫెసర్ జేసన్ స్టాన్లీ

- Advertisement -
- Advertisement -

వుడ్‌బ్రిడ్జ్, న్యూజెర్సీ: భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అధికార బిజెపి నాజీ పాలకుల పోకడలను అనుసరిస్తోందని, ఆ రెండింటి మధ్య స్పష్టమైన పోలికలు ఉన్నాయని యాలె యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫాసిజంపై పరిశోధనలు చేసిన ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ జేసన్ స్టాన్లీ చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న కాలం 2002లో మారణహోమం జరిగి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూ జెర్సీలోని వుడ్‌బ్రిడ్జ్‌లో ఆదివారం ఇండియా అమెరికన్ ముస్లిం కౌన్సిల్(ఐఎఎంసి) ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ స్టాన్లీ ప్రసంగిస్తూ నాజీలతో తమను తాము పోల్చుకోవడం పట్ల మోడీకి చెందిన మద్దతుదారులు, ఇతర హిందూత్వవాదులు సంబరాలు జరుపుకుంటారని, యూదుల పట్ల నాజీలు ఏం చేశారో ముస్లింల పట్ల తాము కూడా అదే చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టంగా చెప్పిందని అన్నారు. జర్మనీకి చెందిన యూదుల పౌరసత్వాన్ని కాలరాయడానికి నూరెంబర్గ్ చట్టాలు ఎలా ఉపయోగపడ్డాయో అదే విధంగా ముస్లింల భారతీయ పౌరసత్వాన్ని హరించడానికి బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఉపయోగపడుతుందని డాక్టర్ స్టాన్లీ వాదించారు. హిందువుల గత చరిత్రను స్వచ్ఛంగా మార్చాలని మోడీ ఎలా భావిస్తున్నారో ఆర్యుల గతాన్ని గురించి అడాల్ఫ్ హిట్లర్ కూడా అలాగే భావించాడని, మోడీకి, గత ఫాసిస్టు పాలకులకు మధ్య పారూప్యాన్ని వివరించడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని ఆయన అన్నారు. 2018లో తాను రాసిన హౌ ఫాసిజం వర్క్ అనే పుస్తకంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కీలక ఉదాహరణలని డాక్టర్ స్టాన్లీ చెప్పారు.

గుజరాత్ మారణహోమం సందర్భంగా కత్తిపోట్లకు గురైన బ్రిటిష్ ముస్లిం ఇమ్రాన్ దావూద్ ప్రసంగిస్తూ డాక్టర్ స్టాన్లీ వాదనతో ఏకీభవించారు. దావూద్ బంధువులు ఇద్దరు, మరో స్నేహితుడు గుజరాత్ మారణహోమంలో సజీవంగా దగ్ధం అయ్యారు. ఈ వేదన తనను జీవితాంతం వెంటాడుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న విధ్వంసకర బుల్‌డోజర్ విధానాలను మనం వ్యతిరేకించాలని ఆయన అన్నారు. బుల్‌డోజర్లను మానవాళి నిర్మాణానికి ఉపయోగించాలే తప్ప మానవాళి విధ్వంసానికి కాదని దావూద్ చెప్పారు.

ముస్లింల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్‌డోజర్లను తరచు పంపడంపై ఐఎఎంసి మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మోడీకి, ఆయనకు చెందిన బిజెపి ఇస్లామోఫోబిక్ విధానాలకు బుల్‌డోజర్లు అంతర్జాతీయ చిహ్నంగా మారిపోయాయని ఐఎఎంసి వ్యాఖ్యానించింది.

గుజరాత్ మారణకాండలో మోడీ పాత్రను ప్రశ్నించినందుకు జైలుపాలైన మాజీ సీనియర్ పోలీసు అధికారి సంజయ్ భట్ కుమార్తె ఆకాషి భట్ ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వం తన తండ్రిపై ఎలా కక్షకట్టింది వివరించారు. ఒక పద్ధతి ప్రకారం, ఉద్దేశపూర్వకంగా న్యాయ వ్యవస్థలో జాప్యం జరుగుతోందని ఆమె అన్నారు. రేపిస్టులు, హంతకులు స్వేచ్ఛగా తిరుగుతుండగా ఒక నిజాయితీపరుడైన పోలీసు అధికారి కారాగారంలో ఉండడం మోడీ పాలనలోని భారత్‌లో ఇప్పుడు చూస్తున్నామని ఆమె అన్నారు. న్యాయవ్యవస్థను ధ్వంసం చేశారని, హక్కుల కార్యకర్తలు జైలుపాలవుతున్నారని ఆమె అన్నారు.

ప్రముఖ హక్కుల కార్యకర్త, పాలిస్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచిత్రా విజయన్ ప్రసంగిస్తూ మోడీ, బిజెపిల దృష్టిలో భారతదేశ దార్శనికత అంటే హిందూ జాతీయవాదమేనని అన్నారు. హిందూ ఆధిపత్యమే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పునాదులని ఆమె చెప్పారు. మత హింసను అణచివేయడంలో గత ప్రభుత్వాల వైఫల్యాలే ప్రస్తుత హిందూ ఆధిపత్య హింసకు కారణమని ఆమె అన్నారు. గుజారత్‌లో జరిగిన మారణహోమం ఆగలేదని, భారత్‌లో ప్రతిరోజు కొనసాగుతూనే ఉందని, ముస్లిలపై దాడులు ఇప్పటికీ జరుగూతూనే ఉన్నాయని ఆమె చెప్పారు. సమావేశంలో ప్రసంగించిన ఆఫ్రికన్- అమెరికన్ వక్తలు భారత్‌లో హిందూత్వ శక్తుల ఓటమి కోసం పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News