Saturday, December 21, 2024

రేపిస్టులకు క్షమాభిక్ష!

- Advertisement -
- Advertisement -

Indian Independence Day Diamond Celebrations కాకరకాయ విత్తనాలు చల్లి వంకాయలు కాయలేదనడంలో ఏమైనా అర్ధం ఉందా? మోడీత్వ మతతత్వ శక్తులను ఎన్నుకొని మతోన్మాద రేపిస్టులను జైలు నుంచి విడుదల చేశారంటూ ఆక్షేపించడం, అభ్యంతరం చెప్పడం, వారిపై విమర్శలు గుప్పించడం ఏమైనా బాగుందా? రాజ్యాంగం పట్ల, అది నిర్దేశించిన సామరస్య, సప్రజాస్వామిక విలువలపట్ల వారికి గౌరవం బొత్తిగా లేదని గగ్గోలు పెట్టడం ఏమైనా సమంజసంగా ఉందా? 2002 దారుణ, అమానుష అల్లర్లలో గర్భవతి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె మూడేళ్ళ కుమార్తె సహా ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో దోషులు 11 మందిని జైలు నుంచి విడుదల చేసినందుకు గుజరాత్ ప్రభుత్వం పై, ప్రధాని మోడీపై ప్రతిపక్షం విరుచుకు పడడంలో వారి వృధా వేదన, ఆగ్రహమే వ్యక్తమవుతున్నాయి తప్ప మెజారిటీ మతవాదంతో దేశ సెక్యులర్ పునాదులను పెకలించి వేయడమే ధ్యేయంగా పని చేస్తున్న బిజెపి పాలకులలో మార్పు వస్తుందని బొత్తిగా ఆశించలేము.

ప్రతిపక్షాలుగాని, మీడియా గాని, మానవతావాదులు గాని ఈ సందర్భంలో వెలిబుచ్చే ఆగ్రహ, అసంతృప్తులు దేశ ప్రజల్లో సదాలోచనను రగిలించి మతోన్మాదులకు మరోసారి అధికారం అప్పగించరాదనే చైతన్యం వారిలో కలిగితే దేశానికి మంచి రోజులు వస్తాయి. లేకపోతే ఈ అమానుష శక్తుల దురాగతాలు ఇలాగే కొనసాగి, సెక్యులర్ దేశమనే ఖ్యాతిని శాశ్వతంగా కోల్పోక తప్పదు. గోధ్రా లో రైలు బోగిలోని కర సేవకుల సజీవ దహనం ఘటన తర్వాత జరిగిన అల్లర్లలో 1044 మంది మరణించారు. 233 మంది తప్పిపోయారు. 2500మంది గాయపడ్డారు.

మృతి చెందిన వారిలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులని తేలింది. ఈ ఘోరమారణకాండ ఒక పథకం ప్రకారం జరగలేదని, దాని వెనుక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హస్తం లేదని తాను నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) చేసిన నిర్ధారణను సుప్రీంకోర్టు ధ్రువపరిచింది. తగిన సాక్షాధారాలు లేని కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆ తీర్పు వెల్లడించింది. అయితే అల్లర్ల వెనుక మోడీ హస్తం ఉందని ఆ సమయంలో ఉన్నత పోలీస్ పదవిలో ఉన్న సంజీవ్ భట్ ఆరోపించారు. సిట్ దర్యాప్తు మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్ రాష్ట్ర రాజధానిలోనే గంటల తరబడి ఈ మారణకాండ సాగిపోయింది. అప్పటి ప్రధాని వాజపేయి ఆ సందర్భంగా గుజరాత్ సందర్శించారు. వేదికపై నరేంద్ర మోడీ తన పక్కనే కూర్చొని ఉండగా ఆయన మాట్లాడుతూ పాలకులు తమ ప్రజల పట్ల కుల మతాల ప్రాతిపదికన వివక్ష చూపకుండా రాజధర్మాన్ని పాటించాలని అన్నారు. ఇదంతా గతం. ఇప్పుడు దేశ అధికార పీఠం మీద, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ అధికారంలో గల బిజెపి, సంఘ్ పరివార్ శక్తుల ఆధిపత్యానికి అడ్డులేదు.

బిల్కిస్ బానో కేసు దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఇందులో భాగంగానే చూడాలి. ప్రధాని మోడీ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోటపై నుంచి మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారత, ఆత్మగౌరవం గురించి జాతికి ఉద్బోధ చేశారు. వాటిని గాయపరిచే పనులేమీ చేయొద్దని చెప్పారు.ఆ మరుక్షణంలోనే గుజరాత్ ప్రభుత్వం 11మంది రేప్ దోషులను విడుదల చేసింది. ప్రధాని చెప్పిన దానికి గుజరాత్ ప్రభుత్వం చేసిన దానికి పొంతన ఏ మాత్రం లేదు. ఈ 11 మందికి సామూహిక అత్యాచారం, ఏడుగురి హత్యకు గాను ముంబైలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 2008 జనవరిలో యావజ్జీవ శిక్ష విధించింది. దానిని బొంబాయి హైకోర్టు ధ్రువపరిచింది.

స్వాతంత్య్ర దినోత్సవ క్షమాభిక్షల విధానంలో భాగంగా తన విడుదలకు ఆదేశించాలని వీరిలో ఒకరు చేసుకున్న విజ్ఞప్తిపై దాని యోగ్యత, అయోగ్యతలను బట్టి నిర్ణయం తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిని సాకుగా తీసుకొని అది వీరందరికీ క్షమాభిక్ష పెట్టింది. జైలు వద్ద వీరికి దండలు వేసి స్వాగతం పలికారు, మిఠాయిలు పంచారు. ఈ పంద్రాగస్టున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే విషయంలో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇక్కడ గమనించదగినవి. ఆజాది కా అమృత్ మహోత్సవాల క్షమాభిక్షలకు అత్యాచార, మానవ అక్రమ రవాణా దోషులు, యావజ్జీవ ఖైదీలు అర్హులు కారని ఇందు లో కేంద్రం స్పష్టంగా పేర్కొన్నది. కేంద్రంలోని తన ప్రభుత్వ ఆదేశాలనే రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఉల్లంఘించింది. స్వార్ధ ప్రయోజనాలు సాధించుకొనేటప్పుడు బిజెపి పాలకులకు ఎటువంటి నీతి నియమాలు అడ్డురావు. తమ మాటనే తాము బేఖాతరు చేయడంలో వారికి సాటిలేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News