న్యూఢిల్లీ : అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు ప్రియురాలిని వేధిస్తున్నందుకు సీనియర్ అధికారిని ఒక క్లర్క్ హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ఢిల్లీ లోని ఆర్కేపురంలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల మహేష్ కుమార్ సర్వేఫ్ ఇండియా డిఫెన్స్ ఆఫీసర్ కాంప్లెక్స్‌లో సీనియర్ సర్వేయర్. అప్పుగా తీసుకున్న రూ. 9 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని , తన ప్రియురాలని కూడా అతడు వేధిస్తున్నాడని క్లర్క్ అనీష్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో మహేష్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
ఆగస్ట్ 28న అనీష్ సెలవు తీసుకుని లజ్‌పత్ నగర్ లోని మార్కెట్‌లో పాలిథిన్ షీట్, పార కొనుగోలు చేశాడు. ఆర్కేపురం సెక్టార్ 2 లోని తన నివాసంలో కలుసుకుందామని మహేష్ కుమార్‌ను పిలిచాడు. ఆమేరకు మహేష్ కుమార్ రాగానే తలప పైప్ రెంచ్‌తో కొట్టి హత్య చేశాడు. తరువాత సొంత ఊరు హర్యానా లోని సోనిపట్‌కు బైక్‌పై పారిపోయాడు. మరునాడు ఢిల్లీకి తిరిగి వచ్చి రాత్రివేళ క్వార్టర్స్‌లోని ఆవరణలో గొయ్యి తవ్వి మహేష్ మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ఆ ప్రదేశాన్ని సిమెంట్‌తో కప్పేశాడు. మరోవైపు మహేష్ కుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి సోదరుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. చివరకు దర్యాప్తు జరిపి సెప్టెంబర్ 2న మహేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లర్క్ అనీష్‌ను అరెస్ట్ చేయగా నేరం బయటపడింది.