Sunday, December 22, 2024

వ్యవసాయంతో వాతావ’రణం’!.. వర్షాలు.. వడగాలులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ వ్యవసాయరంగం ప్రకృతి విపత్తలు విసురుతున్న సవాళ్లమధ్య సాహసోపేతంగా ముందుకు సాగుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయంతోపాటు పశుసంవర్ధకం, మత్సపరిశ్రమ, పాడి పరిశ్రమ తదితర అనుబంధ రంగాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెనుసవాళ్లను విసిరుతున్నా యి. సాధారణ పరిస్థితుల కంటే ఉష్ణోగ్రతలు ఒకటిన్నర శాతం పెరిగితే దాని ప్రభావం పంటల ఉత్పాదకతను దెబ్బతీస్తోంది. పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.వడగాలులు పంటలనే కాదు పశు, పక్ష్యాదు ల్లో సైతం ఎదుగుదలను మందగింపచేసి సంతానోత్పత్తి సామర్దతను దెబ్బతీస్తున్నాయి. పాలు , మాసం , గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. మరో వైపు అధిక వర్షాలు , వరద లు వగగండ్ల వానలు , వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను ఒక్క సారిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి.

ప్రగతి రధాన్ని వెనక్కు లాగేస్తున్నాయి. వర్షాలు , వడగాలుల వాటి రకాలు , ప్రభావంలో రైతులకే కాకుండా సామన్యప్రజానీకానికి తెలియని ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు బయట పెడుతున్నారు.వర్షాల్లో తేలిక పాటి వర్షాలు , ఒక మోస్తరు వర్షాలే కాదు వాటిలో 25రకాలుగా ఉన్నాయంటే ఆశ్చర్యం గొలుపుతోంది. రాష్ట్రంలో వీటికి ఎన్ని రకాల పేర్లు పెట్టినా వాటి స్వభావం కూడా అదే విధంగా మారిపోతోంది. గాంధారివానను కంటికి ఎదురుగా ఉ న్నది కనిపించనంత జోరుగా కురిసే వానగా పేర్కొంటా రు. మాపుసారివానను సాయంత్రం కురిసే వానగా పిలుస్తారు.మీసరవాన మృగశిరకార్తెలో కురిసే వానగా భావిస్తారు.దుబ్బురువానను తుప్పర లేదా తుంపర వానగా చెబుతారు. సానిపివానను అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వానగా భావిస్తారు. సూరునీల్లవాన అంటే ఇంటి చూరు నుండి ధార పడేంత వానగా పిలుస్తారు.

బట్టదడుపువాన అంటే ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వానగా చెబుతారు. తెప్పెవాన అంటే ఒక చిన్న మేఘం నుంచి పడే వానగా పిలుస్తారు.సాలువాన అంటే ఒక నాగలిసాలుకు సరిపడా వానగా పరిగణిస్తారు. ఇరువాలువానను రెండుసాల్లకు, విత్తనాలకు సరిపడా వానగా చెబుతారు. మడికట్టువాన అంటే బురదపొలం దున్నేటంత వానగాపిలుస్తారు. ముంతపోతవానఅంటే ముంతతోటి పోసినం త వానగా భావిస్తారు. కుండపోతవాన అంటే కుండతో కుమ్మరించినంత వానగా రైతులు భావిస్తారు. ముసురువాన అంటే విడువకుండా కురిసే వాన భావిస్తారు.

దరోదరివాన అంటే ఎడతెగకుండా కురిసే వాన అని అర్ధంగా భావిస్తారు.బొయ్యబొయ్యగొట్టే వాన అంటే హోరుగాలితో కూడిన వానగా భావిస్తారు.రాళ్లవానను వడగండ్ల వానగా పిలుస్తారు. కప్పదాటువాన అంటే అక్కడక్కడా కొంచెం కురిసే వానగా భావిస్తారు. తప్పడతప్పడవాన అంటే టపటపా కొంచెంసేపు కురిసే వానగా చెబుతారు. దొంగవాన అంటే రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వానగా భావిస్తారు. కోపులు నిండేవానను రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన భావిస్తారు. ఏక్దారవాన ఏకధారగా కురిసే వాన అని పిలుస్తారు. మొదటివానను విత్తనాలకు బలమిచ్చే వానగా భావిస్తారు. సాలేటివాన అంటే భూమి తడిసేంత భారీ వానగా భావిస్తారు. సాలుపెట్టువాన అటే దున్నేందుకు సరిపోయేంత వాన అని రైతులు అర్ధం చెబుతారు.

40డిగ్రీలు దాటితే వడగాలులే:
గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారం వలన ప్రపంచ వాతావరణంలో పలు మార్పులు సంభవించి భూగోళం త్వరగా వేడెక్కడం ,ప్రతి ఏటా వడగాలుల తీవ్రత పెరగం జరుగుతోంది. వేసవిలో మార్చి నుంచి జూన్ వరకూ ఎక్కువగా , కొన్ని సందర్భాల్లో ఉత్తర భారతంలో అయితే జులైలో కూడా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మైదాన ప్రాంతాల్లో గాలిలో వాస్తవ ఉష్ణోగ్రత కనీసం రెండు రోజులు 40డిగ్రీల కంటే ఎక్కవగా నమోదదై , అదే విధంగా సాధారణం కన్నా 4.5 నుండి 6.4 డిగ్రీలు ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని వడగాలులగా వర్గీకరిస్తారు. అదే గాలిలో వాస్తవ ఉష్ణొగ్రత 47 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవటం , లేదా సాధారణం కన్నా 6.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్టియితే తీవ్రమైన వడగాలులుగా పరిగణించి హెచ్చరికలు జారీ చేస్తారు.

వడగాలుల కింద 589మండలాలు :
దేశంలో ఉత్తర ప్రదేశ్ ,బీహార్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సంవత్సరానికి సాధారణంగా 4నుండి 6 వడగాలుల సంఘటనలు జరగుతుంటాయి. ఈ వడగాలులు మారిన పరిస్థితుల వల్ల వీటి సంఖ్య 4నుండి 7కు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో వడగాలులు వీచే మండలాల కింద 589మండలాలను గుర్తించారు. వేడి గాలులు వీచే వాటి కింద 582మండలాలు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గాలిలో పెరిగిన ఉష్ణోగ్రతల తీవ్రత ప్రజల పైనే కాకుండా మొక్కలు, పశువులు, కోళ్లు ఇతర జీవులపైన ప్రభావం చూపి వాటి పనితీరు వ్యవస్థను తీవ్ర వత్తిడికి గురిచేస్తుందని శాస్త్రవేత్త డా.డి నాగరాజు వెల్లడించారు. వేడి ప్రభావం ఎంత వరకూ చూపుతుందనేది ఒక మొక్క లేదా జీవి తన జీవన విధానాన్ని మారుతున్న వాతావరణం లేదా ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తిమీద, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. స్వల్పకాలంలో వాతావరణంలో ఎక్కువ మార్పులు సంభవిస్తే ఏ జీవికైనా తన మనుగడను సాగించడం పెద్ద సవాలుగా మారుతుంది. పెరుగుతున్న జనాభాకు సరిపడే ఉత్పత్తి, ఉత్పాదకాలపైన ప్రభావం చూపుతుంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం, అదేవిధంగా గాలిలో తేమ శాతం తగ్గటం, వేడిగాలులకు గురి కావ టం వలన మొక్కలతో నీరు త్వరగా ఆవిరై చనిపోయే ప్రమాదముంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో తగిన జాగ్రత్తలు చేపడితే వడగాలుల ప్రభావం తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News