వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం పాలకులది మొద్దునిద్దరే. వారం రోజుల వ్యవధిలో పత్రికలు వెలుగులోకి తెచ్చిన రెండు ప్రధానమైన సంఘటనలు.. వాతావరణం వికటిస్తే ఎంతటి ఘోర విపత్తులైనా సంభవిస్తాయనడానికి ప్రబల తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాసులకు మొన్నటి మంగళవారం ఒక పీడకలగా జీవితాంతం గుర్తుండిపోతుంది.
మండుటెండలే తప్ప వర్షపు జాడలెరుగని ఈ ఎడారి దేశంలోని పలు నగరాల్లో, మరీ ముఖ్యంగా దుబాయ్ లో కుండపోతగా 24 గంటలపాటు కురిసిన వర్షాలకు ఊరూవాడా ఏకమయ్యాయి. వాగులూ వంకలూ పొంగి ఊళ్లకు ఊళ్లే నీట మునిగే పరిస్థితి పొరుగున ఉన్న ఆసియా దేశాలకు మామూలే. కానీ, ఎడారి ప్రాంతాలుగా పేరొందిన గల్ఫ్‌దేశాల్లో వర్షాలు పడటం వింతల్లోకెల్లా వింత. మిన్నూమన్నూ ఒక్కటైనట్లు కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లే చెరువులైన విపరీత పరిస్థితిని చూసి యుఎఇవాసులే కాదు, ప్రపంచమే దిగ్భ్రాంతి చెందింది.
ఏడాదిన్నర కాలంలో కురియవలసిన వర్షమంతా ఒక్క రోజులోనే కురిస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో తెలియజెప్పేందుకు యుఎఇ ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మరోవైపు, భౌగోళికంగా గల్ఫ్ దేశాలకు సమీపంలో ఉండే ఆఫ్రికాలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. యాభై నాలుగు దేశాల సమాహారమైన ఆఫ్రికా ఖండం కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది.అనేక దేశాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి గుప్పెడు మెతుకులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. మాలి, బుర్కినా ఫాసోవంటి దేశాలను తీవ్రమైన వడగాడ్పులు కుదిపి వేస్తున్నాయి.ఏప్రిల్, మే మాసాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు సహజమే అయినా, ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు మరో 1.4 డిగ్రీల మేర పెరిగినట్లు అంచనా. దక్షిణాఫ్రికా శాసన రాజధాని కేప్ టౌన్‌లో పరిస్థితి కూడా భయానకంగానే ఉంది.
గత ఆరేడేళ్లుగా అలముకున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులవల్ల చుక్కనీరు కరవై ప్రజల కనీస అవసరాలకు సైతం నీరందించలేని దుస్థితిలో ఏకంగా నీటి వినియోగంపైనే ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. వాతావరణ మార్పుల కారణంగా ఒక చోట వరదలు సంభవిస్తే, మరోచోట తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. ఈ విషయమై వాతావరణ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లనుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. భూతాపానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని అరికట్టాలంటూ నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ఆ దిశగా చర్యలు చేపట్టి లక్ష్యాలను సాధించిన దేశం ఒక్కటైనా లేదంటే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయా దేశాధినేతల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. యుఎఇలో సంభవించిన వరదలకు మేఘ మథనం కారణమని తొలుత వార్తలు వచ్చినా, వాటిని పర్యావరణ నిపుణులు తోసిపుచ్చారు.
దుబాయ్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న అసాధారణ అల్పపీడన ప్రభావమే పలు విడతలుగా కురిసిన కుంభవృష్టికి కారణమని ప్రసిద్ధ పర్యావరణవేత్త జెఫ్ మాస్టర్స్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణం పర్యావరణ అసమతుల్యతేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వీటి వలన కరవు కాటకాలు, వరదలు, దావానలం వంటి వైపరీత్యాలు ఏర్పడి ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫ్రికా దేశాల్లో నెలకొన్న పరిస్థితులకు వాతావరణ పెనుమార్పులే కారణమన్నది నిర్వివాదాంశం. సహజసిద్ధంగా ఏర్పడే తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. కానీ, మానవ స్వయంకృతాపరాధాల వల్ల సంభవిస్తున్న ఇలాంటి విపరిణామాలను గమనిస్తే మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడనే భావన కలగకమానదు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యుడి దరికి చేర్చగలిగిన ప్రభుత్వాలు వాతావరణ మార్పులపట్ల అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి.
ఓజోన్ పొర దెబ్బతినడం, భూతాపం, శిలాజ ఇంధన వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు వంటి అంశాలు ప్రపంచ వేదికలపై చర్చలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. దేశానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే పాలకులలో చాలా మందికి వీటిపై అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో ఎత్తులు పైయెత్తులతో నిరంతరం తలమునకలుగా ఉండే నేతలకు ముందుగా ఈ విషమ పరిస్థితులపట్ల అవగాహన కలగాలి. ఆ తర్వాత వాటిని సామాన్య ప్రజలకు విడమరచి చెప్పి, జాగరూకులను చేయాలి. వాతావరణ మార్పులను నివారించేందుకు ప్రణాళికలను రూపొందించాలి. గల్ఫ్ దేశాల్లోనూ, ఆఫ్రికాలోనూ నెలకొన్న అసాధారణ పరిస్థితులను గుణపాఠంగా తీసుకుని ఇకనైనా కళ్లు తెరవకపోతే, అకాల వర్షాలు, వరదలు, పెచ్చుమీరిన మండుటెండలు వంటి వైపరీత్యాలతో మానవాళి అతలాకుతలం కావలసిందే!