న్యూఢిల్లీ : 3500 నుంచి 5500 ఏళ్ల క్రితం వాతావరణ మార్పుల కారణంగా ఐరోపా లోని మానవ జనాభాలో హెచ్చుతగ్గులు సంభవించాయని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. జర్నల్ పిఎల్‌ఒఎస్ వన్‌లో వెలువడిన ఈ అధ్యయనం ఐరోపా మధ్య ప్రాంతాల్లో విశేషంగా ఉన్న పురావస్తు అవశేషాలు, భౌగోళిక వనరుల తాలూకు వాతావరణ మార్పుల డేటా ఆధారంగా నిర్వహించడమైంది. జర్మనీ లోని కీల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ వనరులును ఉపయోగించి అధ్యయనం సాగించారు. మానవ జనాభా పరిణామాలకు, వాతావరణ మార్పులకు ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. ఈ అధ్యయనంలో సెంట్రల్ జర్మనీ లోని సర్కమ్‌హార్జ్ రీజియన్, జెక్ రిపబ్లిక్ / లోయర్ ఆస్ట్రేలియా రీజియన్, దక్షిణ జర్మనీ ముందుభాగమైన ఉత్తర ఆల్పైన్ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు.
ఉత్తర ఆల్పైన్ ముందుభాగం హార్జ్ పర్వత ప్రాంత పరిసరాల్లో, అంటే ఇప్పుడు జెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియాగా పిలువబడుతున్న ప్రాంతాల్లో 3500 నుంచి 5500 సంవత్సరాల క్రితం జనాభా అభివద్ధిలో వాతావరణ మార్పులే కీలక పాత్ర వహించాయని పరిశోధకులు పేర్కొన్నారు. జనాభా పెరుగుదలే కాకుండా, సామాజిక, సాంస్కృతిక మార్పులు కూడా వచ్చాయని వివరించారు. ఈ ప్రాంతాల పురావస్తు ప్రదేశాల్లో దాదాపు 3400 కార్బన్‌డేట్లు సేకరించారు. వెచ్చని, తడి కాలాల్లో పంటలు , ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో జనాభా పెరగడానికి దోహదపడిందని, శీతలం, పొడి కాలాల్లో జనాభా తరచుగా తగ్గుదల కనిపించిందని తేల్చారు. అయితే పరిమితమైన ఆధారాలతో ఈ అధ్యయనం వక్రీకరణ చెందే అవకాశం లేకపోలేదని కూడా పరిశోధకులు ఉదహరించారు.