Friday, November 15, 2024

వాతావరణ మార్పులు: భారీ ప్రాజెక్టులు

- Advertisement -
- Advertisement -

వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్ ఉద్గారాలు, అభివృద్ధి కోరుతూ ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య మార్పుల సహజంగానే ఇమిడి ఉంటాయి. ప్రపంచంలో ఏ భారీ ప్రాజెక్టు లేదా మౌలిక వసతుల కల్పన జరిగినా పర్యావరణ ఆరోగ్యానికి స్వల్ప విఘాతం కలగక తప్పదు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించ తలపెట్టిన ప్రతి సారి పర్యావరణ ప్రేమికులతో పాటు (కుహనా) మేధావులు, లాభాపేక్ష కోరుకునే స్వార్థ సంఘాలు, ప్రజా సంఘాలు తమ గళాలను వివిధ కారణాలతో వినిపిస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వం నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సమ్మె లు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు వంటివి నిర్వహించడం కూడా చూస్తున్నాం. ప్రజలకు మరిన్ని సౌకర్యాల కల్పించే క్రమంలో ప్రకృతి సహజత్వానికి కొంత వరకు ప్రతికూల ఫలితాలు కలుగవచ్చు. ఇటీవల దేశంలో చేపట్టిన రెండు భారీ అభివృద్ధి ప్రాజెక్టులైన ‘దియోధర్ అంతర్జాతీయ విమానాశ్రయం’, ‘బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారు’ లను మన ప్రధాని ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు కనీస అవసర మౌలిక వనరుల కల్పన నిమిత్తం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతున్నదని కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, పర్యావరణానికి తామే అసలైన యజమానులమని భావించే సమూహాలు గొంతుచించుకున్నప్పటికీ ప్రయోజనం కనిపించ లేదు.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే
దేశ ప్రధాని ఫిబ్రవరి 2020లో శంకుస్థాపన చేసిన ‘బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే’ రూ. 14,850 కోట్ల వ్యయం తో 296 కి.మీ మేర నాలుగు -వరుసల ఎక్స్‌ప్రెస్ రహదారిని రికార్డు సమయంలో 29 మాసాల్లో నిర్మించడం విశేషంగా పేర్కొనబడుతున్నది. అన్ని రంగాల్లో వెనుకబడిన యుపి, ఎంపి రాష్ట్రాల్లో భాగమైన బుందేల్ ఖండ్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఎలాంటి భారీ ప్రాజెక్టులు రాకుండా గతంలో పర్యావరణ పరిరక్షణ సంఘాలు అడ్డుకున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో చిత్రకూట్ నుంచి ఢిల్లీకి ప్రయాణ సమయం 4 గం. వరకు తగ్గుతున్నదని, ఈ సౌకర్యంతో ఆ ప్రాంతం అభివృద్ధి వెలుగులను చూడనుందని విశ్లేషకులు అంటున్నారు. నీటి కొరత అధికంగా ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంతవాసులు జీవనోపాధి కోసం సమీప పట్టణాలకు వలసలు వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతూనే వున్నది
దియోధర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
దియోధర్ అంతర్జాతీయ విమానాశ్రయం, బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నవ్య డిజిటల్ లోకానికి దగ్గరకానున్నారు. దియోధర్ ప్రాంతం చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిలయంగా పేరొందింది. జార్ఖండ్‌లోని ఈ వెనుకబడిన ప్రాంతంలో డాబర్ కంపెనీ పరిశ్రమ కూడా పని చేస్తున్నది.గతంలో ఈ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణాలను పర్యావరణవేత్తలు తమ ఆందోళనలతో నిన్నటి వరకు నిలువరించగలిగారు. గతంలో పశ్చిమ బెంగాల్ లో తలపెట్టిన ‘టాటా నానో ప్రాజెక్టు’ను పలు ఎన్‌జిఒలు వ్యతిరేకించడం, స్థానిక అమాయకులను సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగించి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో పనులను మధ్యలోనే ఆపేసి టాటా కంపెనీ బయటకు రావడం మనకు గుర్తుంది. దేశ సత్వర సుస్థిరాభివృద్ధిలో కీలక పాత్రను నిర్వహించే భారీ ప్రాజెక్టులు వెనుకబడిన ప్రాంతాల్లో రాకుండా ఆర్థిక, లాభాపేక్ష కలిగిన పర్యావరణ సంఘాలు నిరంతరం ఆందోళనలు చేస్తూ నిబద్ధత గల సంఘాలకు కూడా చెడ్డ పేరు తెచ్చేలా, ప్రగతిని అడ్డుకోవడం దేశ నలుమూలల పలు సందర్భాల్లో జరుగుతోంది. అదే విధంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో జె.కె. స్టీల్ కంపెనీ 1174 హెక్టార్లలో ఏడాదికి 13.2 మిలియన్ టన్నుల ఉక్కును తయారు చేయగల పరిశ్రమ పనులను నిలువరించడానికి నేటి పర్యావరణ ప్రేమికులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వేదాంత కాపర్ కంపెనీ
తమిళనాడు తుత్తుకుడిలో వేదాంత కంపెనీ కాపర్ లోహ పరిశ్రమ అదనంగా సాలీనా ఉత్పత్తిని 4 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నుల స్థాయికి పెంచడానికి, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద కాపర్ పరిశ్రమగా నిలిపేందుకు పనులను ప్రారంభించగా ఆందోళనల వల్ల పరిశ్రమల స్థాపన ఆగిపోవడంతో 20,000 మంది ప్రత్యక్ష ఉద్యోగులు, పరోక్షంగా దాదాపు లక్ష ప్రజలు ప్రభావితం అవడం జరిగింది. ఇలాంటి భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకునే అశాస్త్రీయ, అనాలోచిత, అసంబద్ధ మేధావులు, ఆందోళనకారులు యాజమాన్యాలతో కాని, ప్రజా వేదికపై బహిరంగ చర్చలకు గాని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం చూశాం. భారీ పరిశ్రమలు రాకుండా విదేశీ, స్వదేశీ బడాబాబులు తమ స్వార్థ ప్రయోజనాలకు, కృత్రిమ పర్యావరణ ఉద్యమాలకు ఊపిరిపోస్తూ వాటి స్థాపనను, ఉత్పత్తులను అడ్డుకోవడం పరిపాటి అయింది.
అహ్మదాబాదు-ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్
జపాన్ సంస్థ ఆర్థిక సహాయంతో కేంద్ర రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ‘అహ్మదాబాదు- ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్’ ప్రాజెక్టుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వ మహారాష్ట్ర ప్రభుత్వం అటవీ భూసేకరణలను ఇవ్వకపోవడంతో రూ. 1,10,000 కోట్ల (జపాన్ సంస్థల పెట్టుబడులు రూ. 88,000 కోట్లు) పనులు ఆగిపోయాయి. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. ప్రపంచ జనాభాలో 17% గా ఉన్న భారత దేశం కేవలం 5 శాతం ప్రపంచ కార్బన్ ఉద్గారకాలకు కారణం అవుతున్నదని మరిచిపోరాదు. ప్రభుత్వాలు, పర్యావరణ ప్రేమికులు అభివృద్ధికి, వాతావరణ మార్పులకు సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ, పర్యావరణానికి కనిష్ట హానితో భారీ ప్రాజెక్టులను రూపకల్పన చేస్తూ మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాల రుచి చూపవలసిందే. వాతావరణ మార్పుల ప్రచారం, అమలులో భారత ప్రభుత్వం నిబద్ధతతో అంతర్జాతీయ జి7, ఐ2యు2, క్వాడ్ సమావేశాల్లో తన వాదనలు వినిపిస్తూనే ఉన్నది. తీవ్ర వాతావరణ మార్పులకు కారణమైన పరిశ్రమలను స్థాపించతలపెట్టిన స్వార్థ పారిశ్రామికవేత్తలను, అవినీతి ప్రభుత్వ వ్యవస్థలు, ప్రతిపక్ష పార్టీలు పలు ఆందోళనలతో అడ్డుకొని ప్రాజెక్టులు రాకుండా చేయగలిగారు. కాని విచక్షణ మరిచిన పర్యావరణ ప్రేమికులు అన్ని ప్రాజెక్టులను వ్యతిరేకించే అనాలోచిత, అశాస్త్రీయ, స్వార్థపర ‘మేతా’వుల నిరసనలను అదుపు చేస్తూ భారీ ప్రాజెక్టులతో పాటు దేశ సుస్థిరాభివృద్ధి దిశగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పుతూ అభివృద్ధి చెందిన దేశంగా భారతాన్ని నిలుపుదాం. అన్ని వర్గాలకు చెందిన అణగారిన బడుగుల బతుకుల్లో ప్రగతి వెలుగులు చూపుదాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News