Wednesday, January 22, 2025

వాతావరణ సంక్షోభం

- Advertisement -
- Advertisement -

వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో 21వ శతాబ్దిలోకి పయనిస్తోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ఇచ్చిన సందేశంలో తెలిపారు. ‘నేడు భారత దేశం పర్యావరణం, ఆర్థిక వ్యవస్థల మధ్య సంపూర్ణ సంతులనం ఏ విధంగా సాధించాలో అన్న విషయంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది’ అంటూ గత డిసెంబర్‌లో కాప్ సదస్సులో ప్రసంగిస్తూ చెప్పారు. ఈ విధంగా జాతీయ, అంతర్జాతీయ వేదికల నుండి మన ప్రధాని పర్యావరణ కార్యాచరణలో భారత్ పాత్ర గురించి ఎన్నో గంభీరమైన ప్రసంగాలు చేస్తూ వచ్చారు.

అయితే, 2022 ప్రపంచ పర్యావరణ పనితీరు సూచికలో 180 దేశాలలో 180వ స్థానంలో ఉన్నామంటే ఎటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నా మో అర్ధం అవుతుంది. ఆయన ప్రసంగాలలో నెలకొన్న గాంభీర్యం బడ్జెట్ కేటాయింపులలో, కార్యాచరణలో కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణమని గమనించాలి. చరిత్రలో ఎరుగని భారీ ఉష్ణోగ్రతలను ఢిల్లీ, నాగపూర్ వంటి నగరాలు ప్రస్తుతం చవిచూస్తున్నాయి. పర్వతాలలో అతి పిన్న వయస్సుగల హిమాలయ పర్వతాలు విచ్చలవిడి అభివృద్ధి నమూనాల కారణంగా గతించిపోతున్నాయి. సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో సంభవిస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు కొట్టుకుపోవడం గమనిస్తుంటే పర్యావరణంపై ఎటువంటి విష ప్రభావం చూపుతుందో అర్ధం అవుతుంది.

పర్యాటక రంగానికి ప్రాధాన్యత పేరుతో హిమాలయాల విధ్వంసానికి పూనుకొంటున్నామనే ఆందోళన కలుగుతుంది. మరోవంక సులభతర వ్యాపారంలో భారత దేశం 2014లో 142వ రాంక్‌లో ఉంటే, ప్రపంచ బ్యాంకు ఈ రాంక్‌లు ఇవ్వడం ఆపివేసిన 2019లో 63వ రాంక్‌కు చేరుకున్నాము. కానీ పర్యావరణంలో మాత్రం 2012లో 125వ రాంక్ లో ఉంటే 2022 నాటికి 180వ రాంక్‌కు దిగజారిపోయాము. తాజాగా పర్యావరణ పత్రిక డౌన్‌తో ఎర్త్‌తో కలిసి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ)విడుదల చేసిన వార్షిక గణాంకాలు సైతం పర్యావరణ విధ్వంసం ఫలితంగా ఎంతగా దిగజారిపోతున్నామో వెల్లడి చేస్తున్నాయి.

మరో వారం రోజులలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సమయంలో కఠిన వాస్తవాలతో కూడిన ఈ గణాంకాలు వారికి ఓ విధంగా కనువిప్పు కాగలవని ఆశిద్దాము. ఈ నివేదిక వెల్లడించిన గణాంకాలు భయంకరమైన చిత్రాన్ని చిత్రించాయి.కానీ అందులో ఒక అవకాశం దాపురించింది. ఈ నివేదిక కొత్త పాలన ప్రాధాన్యతలను వివరిస్తుంది. -ఈ రోజు మనం ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాల్సిన రంగాలను సూచిస్తుంది’ అని సిఎస్‌ఇ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు.

ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లక్ష్యాలను చేరుకోవడానికి సంసిద్ధతకు సంబంధించి 166 దేశాలలో భారతదేశం 112వ స్థానంలో ఉంది. భారత దేశ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి (హైడ్రోతో సహా) వాస్తవానికి 2022-23, 2023- 24 మధ్య 1.5% తగ్గింది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉత్పత్తిపడిపోయింది. తలసరి ఆరోగ్య వ్యయం కూడా తగ్గుతోంది. 12 రాష్ట్రాలు జాతీయ సగటు కంటే దిగువన ఉన్నాయి. జాతీయ పంటల బీమా పథకం కింద బీమా చేయబడిన ప్రాంతం 2022- 23లో పథకం ప్రారంభించినప్పటితో పోలిస్తే 12 శాతం తగ్గింది.

అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తక్కువ తలసరి ఆరోగ్య వ్యయం, అధిక సంక్రమించని వ్యాధుల సంభవం, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి క్షీణించడం, సరిపోని పంట బీమా కవరేజీతో పోరాడుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు డౌన్ టు ఎర్త్ మేనేజింగ్ ఎడిటర్ రిచర్డ్ మహాపాత్ర తెలిపారు. 26 రాష్ట్రాలు/ యుటిలలో మొత్తం మరణాలలో 50% నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్. ఢిల్లీ, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోని చాలా రాష్ట్రాలు ఉన్నాయి. 23 రాష్ట్రాలు / యుటిలు గ్రామీణ గృహాలలో 100 శాతం కుళాయి నీటి కనెక్షన్‌లను సాధించలేదు. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటిగా అవతరించింది. తొమ్మిది రాష్ట్రాలు/ యుటిలలో వాయు కాలుష్య స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నా యి.

నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా విశృంఖలంగా జాతీయ రహదారుల విస్తరణ చేపడుతూ ఉండడంతో వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి. ఎప్పుడూ నాలుగేళ్లకు సరిపడే ఆహార ధాన్యాలు నిల్వఉండే దేశంలో ఇప్పుడు ఒక ఏడాది పంటల ఉత్పత్తి తగ్గితే ఆహార కొరతే అనే భయం వెంటాడుతున్నది. దేశం ఆహార భద్రత ప్రశ్నార్ధకంగా మారే ఆందోళన వ్యక్తం అవుతుంది. తలసరి విద్యుత్ లభ్యత పరంగా, 16 రాష్ట్రాలు/ యుటిలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్, అసోం, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2023లో భారతదేశం అత్యంత వేడి వాతావరణం చూసింది. దేశంలోని 36 రాస్త్రాలు/ యుటిలు ఉంటే 26 రాష్ట్రాలలోని 102 వాతావరణ స్టేషన్లు రికార్డ్ బ్రేకింగ్ ఉష్ణోగ్రతలను చూశాయి.

అదే సమయంలో 23 రాష్ట్రాలు/ యుటిలలో 69 వాతావరణ స్టేషన్లు రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేశాయి. జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2023 మధ్య, భారత దేశం 365 రోజులలో 318 రోజులలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని నివేదిక పేర్కొంది. ఈ సంఘటనలు 3,287 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.2 మిలియన్ హెక్టార్ల పంట విస్తీర్ణాన్ని నాశనం చేశాయి. 2023 మొదటి మూడు నెలల్లో, మెరుపులు, తుఫానులు అత్యంత తరచుగా సంభవించే తీవ్రమైన వాతావరణ సంఘటనలుగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత విపత్తు ప్రభావ దేశాలలో భారతదేశం 20వ దేశంగా ఉన్నట్లు ఈ నివేదిక పరిశోధకురాలలో ఒకరైన కిరణ్ పాండే తెలిపారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల పరంగా, భారత దేశపు వాటా 1994 నుండి 2019 మధ్య 115 శాతం పెరిగిందని తెలిపారు. 2019 లో దేశం 2,647 మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేసింది.

ఇంధన పరిశ్రమ అతిపెద్ద ఉద్గారిణి. 2019లో మొత్తం జాతీయ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో 76% వాటాను కలిగి ఉంది. నీటి కొరత, నీటి కాలుష్యం, నగరాల్లో వాయు కాలుష్యం, క్షీణిస్తున్న ప్రజా రవాణా మొదలైనవి పర్యావరణ సమతుల్యం భారత దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు. వీటికి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం తగు ప్రాధాన్యతలు ఇవ్వగలదని ఆశిద్దాము. వాతావరణ మార్పుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి. వాతావరణ మార్పుకు తగు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే అభివృద్ధి, జీవనోపాధి, అందరికీ శ్రేయస్సు సాధ్యం కాగలదని గమనించాలి. విశృంఖలంగా భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు ఆమోదాలు తెల్పడం, పర్యావరణ, అటవీ, తీరప్రాంతాలు, వన్యప్రాణులు, జీవారణ్యం, గనులు, ఇతర సహజ వనరుల కు సంబంధించిన చట్టాలను బలహీనపరచడం ద్వారా పర్యావరణ విధ్వంసానికి ప్రభుత్వం దోహపడతున్నది. ప్రకాష్ జవదేకర్, ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ పర్యావరణ మంత్రులుగా విచ్చలవిడిగా పర్యావరణ అనుమతులు ఇస్తూ ఉండడంతో పర్యావరణ విధ్వంసంపై మార్గం ఏర్పర్చిన్నట్లు అవుతున్నది. కేంద్రంలోని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2018లో 577 పర్యావరణ, అటవీ, వన్యప్రాణ, తీరప్రాంత అనుమతులు మంజూరు చేస్తే, వాటి సంఖ్య 2022లో 21 రేట్లు పెరిగి 12,499 అనుమతులు ఇచ్చారు.

అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పర్యావరణ విధ్వసంకు ఏ విధంగా దోహదపడుతుందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులకు 2018లో సగటున 150 రోజుల వ్యవధి పడితే, ఆ వ్యవధిని 2022లో 70 రోజులకు తగ్గించడం గమనార్హం. పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, 2016కు 2018 నుండి 2023 మధ్య 100కు పైగా సవరణలు చేశారు. అంటే పర్యావరణ అనుమతులు ఇవ్వడంలో పర్యావరణ ప్రభావం గురించి అవసరమైన అంచనా వేయడంలో ప్రభుత్వం ఎంతో తొందరపాటుతో వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. చాలా సవరణలను ‘ప్రజా ప్రయోజనం’ పేరుతో ప్రజల మద్దతు అవసరం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేకుండా చేస్తుండటం జరుగుతుంది. భారీ ప్రాజెక్టుల విషయంలో ప్రభావానికి గురయ్యే ప్రజల అభిప్రాయాలు సేకరించడం పట్ల ఎగవేత ధోరణి కనిపిస్తుంది. కనీసం వారి పునరావాసం, పరిహారం వంటి విషయాలలో సైతం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. అభివృద్ధి అంటే ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిగా పరిగణిస్తున్నారు.

మానవ, స్థిరమైన అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకనే నేడు మనం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా పర్యావరణ విధ్వంసాన్ని వేగవంతం కావిస్తున్నది. 2014 బిజెపి ఎన్నికల ప్రణాళికలో ‘అటవీ ప్రజల ప్రయోజనాలు కాపాడి, మెరుగుపరచడానికి కృషిచేస్తాం’ అని పేర్కొన్నది. అయితే, 2023లో అటవీ పరిరక్షణ చట్టం, 1980కు తీసుకొచ్చిన సవరణల ఫలితంగా ‘అటవీ ప్రాంతం’ నిర్వచనాన్ని కుదించే ప్రయత్నం జరిగింది. దానితో సుమారు నాల్గవవంతు అటవీ ప్రాంతం పట్టణీకరణ, గనుల తవ్వకం, అభివృద్ధి ప్రోజెక్టుల పేరుతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో చిక్కుకొని పరిస్థితి ఏర్పడింది. అటువంటి అనుమతులు ఇచ్చే సమయంలో ముందుగా అటవీ ప్రజలు, అక్కడి నివాసితులతో ముందుగా సంప్రదించాలని చట్టబద్ధ ప్రక్రియకు తిలోదకాలిచ్చే ప్రయత్నం జరుగుతున్నది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News