సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనను బిజెపి రాజకీయ సభగా మార్చారని ధ్వజం
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను వేర్వేరుగా చూస్తున్న మోడీ
దక్షిణ రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మోడీ వివక్ష
రామానుజ ఫిలాసఫీకి విరుద్ధంగా మోడీ పాలన
హైదరాబాద్: సమతామూర్తి రామానుజ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ అసమానతలను ప్రదర్శించి, ఆ కార్యక్రమాన్ని బిజెపి రాజకీయ సభగా మార్చాడని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామానుజుల వారి ఫిలాసఫీకి విరుద్ధంగా హైదరాబాద్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ అసమానతలతో జరిగిందన్నారు. అందరూ సమానమేనని చాటి చెప్పే రామానుజుల వాదానికి భిన్నంగా మిగతా పార్టీలు, అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం కాకుండా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బిజెపి తన రాజకీయ వేదికగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు మోడీ బిజెపి అధ్యక్షుడిగా వచ్చారా? ప్రధాని హోదాలో వచ్చారా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రధాని అందరినీ సమానంగా చూడాలన్నారు. కానీ మోడీ ఇందుకు భిన్నంగా వ్యవహరించి విభిజించు పాలించు అన్న బిజెపి ఆలోచన విధానాన్ని బయటపెట్టిండని, దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్ధానికి విమానాశ్రయంలో స్వాగతం పలికే నుంచి వీడ్కోలు పలికే వరకు మోడీ పర్యటన మొత్తం బిజెపి కార్యక్రమంలా సాగిందని ధ్వజమెత్తారు. సమతామూర్తి ఫిలాసఫీకి విరుద్ధంగా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి అనుగుణంగా ప్ధాని మోడీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిజెపి మినహా మిగతా ఎవరూ రాకుండా భద్రత పేరిట ఎస్పీజీ అధికారులతో కట్టుదిట్టం చేయడం ‘ఇక్వాలిటీకి వ్యతిరేకంగా.. రామానుజచార్యకి జరిగిన అవమానంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. రామానుజ విగ్రహ ప్రతిష్టాపనతో హైదరాబాద్‌కు వచ్చిన గౌరవాన్ని అసమానతలు ప్రదర్శించి బిజెపి మంట కలిపిందని దుయ్యబట్టారు.
‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రదర్శించాల్సిన చోట అసమానతలు చూపి, విభజించు రాజకీయ లబ్ది పొందు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వాదాన్ని ప్రదర్శించి, మోడీ రామానుజాచార్యులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించారని నిప్పులు చెరిగారు. రామానుజ ఫిలాసఫీని తూ.చ. తప్పకుండా అమలు చేయాలని, రామానుజ విగ్రహాన్ని బిజెపి రాజకీయ వేదికగా మార్చకుండా చూడాలని నిర్వాహకలకు విజ్ఞప్తి చేశారు. అందరినీ సమానంగా చూడగలిగితేనే రామానుజాచార్యుల ఫిలాసఫీ, ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి విలువ వస్తుందని సూచించారు. సమతామూర్తి స్ఫూర్తిని ప్రధాని మోడీ నింజగా పొందితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలన్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను వేరువేరుగా చూడటం తగదన్నారు. ఉత్తరాది బిజెపి పాలిత రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా చిన్న చూపు చూస్తూ మోడీ వివక్ష ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అసమానతలు పాటించే వారు రామానుజాచార్యుల ఫిలాసఫీని సైతం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని, ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.