Thursday, January 23, 2025

త్వరలో కేజ్రీవాల్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరి కొన్ని రోజుల్లో అరెస్టు చేయాలని సిబిఐ యోచిస్తోందని, ఇందు కోసం మరి కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్‌కు నోటీసులు ఇవ్వనున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం వెల్లడించింది. ఏ కేసులో కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్టు చేయనున్నదో ఆప్ వెల్లడించప్పటికీ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ పొత్తును అడ్డుకోవడానికే బిజెపి ఈ ఎత్తుగడకు పాల్పడిందని ఆప్ ఆరోపించింది. తమ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడాన్ని చూసి బిజెపి బెంబేలెత్తుతోందని ఆప్ వ్యాఖ్యానించింది. ఆప్ ఆరోపణలపై సిబిఐ నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కానప్పటికీ బిజెపి మాత్రం కేజ్రీవాల్‌కు సానుభూతిని కల్పించేందుకే ఆప్ ఈ వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీ, గుజరాత్, హర్యనాలో ఆప్, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంటున్నాయని, రెండు పార్టీల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని ఆప్ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సరుద్బాటు చర్చలు చవరి దశకు చేరుకున్నాయన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) నుంచి కేజ్రీవాల్‌కు ఏడవ సమన్లు జారీ అయ్యాయని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని సిబిఐ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని, ఏ క్షణమైనా కేజ్రీవాల్‌కు సిబిఐ నోటీసులు జారీ చేయవచ్చని ఆయన చెప్పారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌ను మీరు అరెస్టు చేయవచ్చేమో కాని ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తును అడ్డుకోలేరని ఆయన బిజెపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారని ఆప్ రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ విలేకరులతో మాటాడుతూ హెచ్చరించారు. అదే జరిగితే సునామీ వస్తుందని, బిజెపి రాజకీయ లెక్కలు తప్పని తేలిపోతుందని ఆయన చెప్పారు.

కేజ్రీవాల్ అరెస్టు గురించి తాము భయపడడం లేదని, తాము దేశం కోసమే పొత్తు పెట్టుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా, కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయని, ఈ కారణంగానే కేజ్రీవాల్‌కు సానుభూతి కోసం ఆప్ నాయకులు గురువారం నుంచి వదంతలు సృష్టిస్తున్నారని బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ అన్నారు. న్యాయవాదులసాయంతో కేజ్రీవాల్ తన శిక్షను జాప్యం చేయవచ్చని, కాని రానున్న ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆయనను శిక్షించడం ఖాయమని పచ్‌దేవ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News