న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనకు జారీచేసిన తాజా సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం లేఖ ద్వారా సమాధానమిచ్చారు. గురువారం(డిసెంబర్ 21) తమ ఎదుట హాజరుకవాలని ఆదేశిస్తూ ఇడి గత వారం కేజ్రీవాల్‌కు రెండవసారి సమన్లు జారీ చేసింది. ఇడి ఎదుట హాజరుకాని కేజ్రీవాల్ ఈ సమన్లు రాజకీయ దురుద్దేశంతో జారీచేసినవని ఇడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సమన్లను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో జరిగే విపాసన ధ్యానంలో 10 రోజులు పాల్గొనేందుకు కేజ్రీవాల్ బుధవారం బయల్దేరి వెళ్లారు. ఈ నెల 30న ఆయన తిరిగి ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. సమన్లను ఉపసంహరించుకోవాలి. నా జీవితాన్ని నిజాయితీతో, పారదర్శకతతో జీవించాను. దాచడానికి నా దగ్గర ఏమీ లేదు అని కేజ్రీవాల్ ఇడికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌కు రెండవ సమన్లు జారీ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. బిజెపి నాయకులకు కేజ్రీవాల్ అన్నా ఆయన ఢిల్లీ మోడల్ అన్నా భయమని, ఇఈరోజు సంజయ్ సింగ్, మనీష్ సినోడియా, సత్యేంద్ర జైన్(ఆప్ నాయకులు) బిజెపిలో చేరితే వారికి కూడా అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్‌లాగే నిజాయితీపరులై పోతారని ఆప్ వ్యాంగ్యాస్త్రాలు సంధించింది. ఇది ఆప్ నాయకత్వాన్ని లక్షంగా చేసుకుని నమోదైన తప్పుడు కేసని ఆప్ పేర్కొంది. కోర్టులో ఒక్క సాక్ష్యాన్ని కూడా బిజెపి సమర్పించలేకపోయిందని, దేశవ్యాప్తంగా ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే రాజకీయ కక్షసాధింపునకు బిజెపి పాల్పడుతోందని ఆప్ ఆరోపించింది.