Monday, December 23, 2024

కేజ్రీవాల్‌కు 7 రోజుల ఇడి కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్టు అయిన కేజ్రీవాల్‌కు స్థానిక ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఏడురోజుల ఇడి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు వెలువరించింది. శుక్రవారం రాత్రి ఈ రూలింగ్ ప్రకటించారు. స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇడి, కేజ్రీవాల్ లాయర్ల నడుమ తీవ్రస్థాయి వాదోపవాదాలతరువాత ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తమ ఆదేశాలు వెలువరించారు. వాదనల దశలో ఇడి కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. లిక్కర్ సిండికేట్ పుట్టడానికి, లంచాలు వ్యవహారం తలెత్తడానికి మూలసూత్రధారి కేజ్రీవాల్ అని తెలిపింది. ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన తన హయాంలో లిక్కర్ ద్వారా మోసాలకు పాల్పడే వలయం సృష్టించారని , తన పదవిని అడ్డుపెట్టుకుని , ఆప్ పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమ లావాదేవీలు సాగించేందుకు వీలు కల్పించారని, బాధ్యతాయుత సిఎం పదవిని దుర్వినియోగపర్చారని పేర్కొంటూ ,

మరింతగా నిజాలు రాబట్టుకోవడానికి పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించింది. కాగా వాదనల తరువాత కొద్ది సేపు విరామానంతరం కోర్టు తన ఆదేశాలు వెలువరించింది. ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనను కస్టడీలోకి తీసుకోవచ్చునని, కాగా అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తమ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ఒక్కరోజు క్రితమే ఇడి వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్ అని ఇడి పేర్కొంది. సౌత్ గ్రూప్ , ఇతర నిందితులు మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఆప్ అధికారి విజయ్ నాయర్‌కు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తి లేదా దళారిగా వ్యవహరించారని కూడా పేర్కొంది. ఈ స్కాం మొత్తం విలువ రూ 600 కోట్లు దాటింది. ఇందులో రూ 100 కోట్లు సౌత్ గ్రూప్ కేజ్రీవాల్‌కు చెల్లించిందని తెలిపారు. వందకోట్లు కేజ్రీవాల్‌కు బిఆర్‌ఎస్ నేత , ఎమ్మెల్సీ కె కవిత ద్వారా అందాయని , ఆమెను గతవారం అరెస్టు చేశామని ఇడి వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News