Friday, January 10, 2025

మరింత ముదిరిన ఇడి ఆప్ కయ్యం

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీపార్టీ అధినేత , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇడి సమన్లను బేఖాతరు చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించి సోమవారం తమ ఎదుట విచారణకు రావాలని ఇడి సమన్లు వెలువరించింది. అయితే ఇప్పుడు తాను రాలేనని, అయినా ఈ నెల 12వ తేదీ తరువాత ఎప్పుడైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటానని కేజ్రీవాల్ తన లాయర్ల తరఫున వివరణ ఇచ్చారు. ఈ విధంగా దీనితో ఆయన ఇడి సమన్లకు డుమ్మా కొట్టడం ఎనిమిదవ సారి అయింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ వీడని నీడలా చుట్టుకుంది. పలువురు నేతలు విచారణలు ఎదుర్కొంటుండగా , కొందరు జైలు పాలయ్యారు. కేజ్రీవాల్ ఇప్పుడు తిరిగి తమ సమన్లను బేఖాతరు చేయడంపై ఇడి వర్గాలు వెంటనే అధికారికంగా స్పందించాయి. ఆయన సమాధానాన్ని ముందుగా తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అయితే ఆన్‌లైన్ ప్రక్రియలో ఆయనను విచారించేందుకు ఇడి అనుమతిని ఇవ్వకపోవచ్చు. మరోసారి అంటే తొమ్మిదోసారి సమన్లను జారీ చేస్తుందని స్పష్టం అయింది.

కాగా తనకు తరచూ సమన్లు పంపించడంపై ఆప్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడికి సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధం అని, అయితే ఇడి ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు కేవలం రాజకీయ కక్షపూరితం తప్పితే విచారణ క్రమంగా లేదని మండిపడ్డారు. కాగా లోక్‌సభ ఎన్నికల మధ్య అత్యంత కీలక ఘట్టం దశలోనే కేజ్రీవాల్‌ను ఏదో విధంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ఇడి సర్వం సమాయత్తం అయిందని ఆప్ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. సమన్లను తిరస్కరించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని, కోర్టు తుది నిర్ణయం వరకూ వేచి చూడటం ఎవరికైనా మంచిదని సోమవారం తమ వివరణాత్మక ప్రకటనలో తెలిపారు. చట్టవ్యతిరేక సమన్లను తాను పట్టించుకోవల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా తరచూ ఆయన సమన్లను బేఖాతరు చేయడంపై ఇడి స్థానిక సిటికోర్టులో కేసు పెట్టింది.

దీనిపై కేజ్రీవాల్ ఈ నెల 16వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉంటుంది. ఇటువంటివి తాము పట్టించుకోబోమని కేజ్రీవాల్ , ఆయన పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించండి, దీనిని ప్రత్యక్షంగా ప్రజల వీక్షణానికి ప్రసారం చేయండని ఆప్ డిమాండ్ చేసింది. దీని వల్ల ఆప్ నిజాయితి ఏమిటీ? ఇడి వైఖరి ఏమిటనేది ప్రజలకు తెలిసిపోతుంది. వారే నిజాలు నిర్థారించుకుంటారని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ విచారణ, లైవ్ షోకు ఇడికి ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఏదో విధంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించి , జైలుకు పంపించడమే బిజెపి ఆలోచనగా ఉందని, ఈ ఎన్నికలలో ఎదురులేకుండా చేసుకోవాలనేదే వారి ప్లాన్ అని ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహించారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News